ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల వరకు ప్రభంజనమే సృష్టించింది. ముందు నుంచి ఏపీ, తెలంగాణల్లో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ప్రి రిలీజ్ హైప్ చూస్తే బాహుబలికి దీటుగా కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం ఈ సినిమాపై హైప్ అంతగా కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగా కనిపించాయి. నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమా పట్ల ఆసక్తి లేనట్లే కనిపించారు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారింది.
తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లతో మొదలైన ఆర్ఆర్ఆర్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లే రాబట్టింది. అన్ని చోట్లా సినిమా లాభాల బాటలో సాగుతోంది. విడుదల ముంగిట డల్ బుకింగ్స్, తొలి రోజు డివైడ్ టాక్ చూసి కంగారు పడ్డా.. తర్వాత అంతా సానుకూలంగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల అవతల రికార్డులేమీ బద్దలు కాలేదు కానీ.. బయ్యర్లంతా సేఫ్ అయిపోయారు.
ఐతే వచ్చే వారం విడుదల కానున్న కేజీఎఫ్-2 సినిమాకు దేశవ్యాప్తంగా హైప్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ కర్ణాటకలో వసూలు చేసినదానికంటే.. కేజీఎఫ్-2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయబోయే మొత్తం ఎక్కువగా, భారీగా ఉండబోతోంది. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాక.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఇక సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎలాగూ కేజీఎఫ్-2 వసూళ్ల మోత మోగించడం ఖాయం. ఇక దక్షిణాదిన మిగతా రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల్లోనూ ఈ చిత్రానికి మంచి హైపే ఉంది. బాలీవుడ్ ట్రేడ్ పండిట్ల అంచనాల ప్రకారం కరోనా తర్వాత హిందీ మార్కెట్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించబోయే సినిమాగా కేజీఎఫ్-2 నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు నార్త్ మార్కెట్లో ఈ సినిమా రూ.35-40 కోట్ల నెట్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ హిందీలో తొలి రోజు రూ.19 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.