పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల లైన్ విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. పింక్ రీమేక్ వకీల్ సాబ్‌తో రీఎంట్రీకి రెడీ అయ్యాక.. ఆయన ఒప్పుకున్న సినిమాలు వరుస క్రమంలో చూస్తే ఈపాటికి హరిహర వీరమల్లు రిలీజైపోయి ఉండాలి. భవదీయుడు భగత్ సింగ్ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండుండాలి. కానీ మధ్యలోకి భీమ్లా నాయక్ వచ్చి పడటంతో ఈ సినిమాలు వెనక్కి వెళ్లాయి. హరిహర వీరమల్లు చిత్రీకరణ సగమే పూర్తయింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఇంకా మొదలే కాలేదు.
షూటింగ్ ఆరంభించే విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పిన డెడ్ లైన్లు ఎప్పటికప్పుడు దాటిపోతున్నాయి. సినిమా మాత్రం మొదలే కావడం లేదు. చివరగా హరీష్ శంకర్ చెప్పిన దాని ప్రకారం జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రకారం సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. అంటే షూటింగ్ ఇంకా ఆలస్యంగా మొదలు కాబోతోందా.. సినిమా ఇంకా లేటవుతుందా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ విషయం ఇది కాదు. ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
హరిహర వీరమల్లు కోసం ప్రిపరేషన్లో ఉన్న పవన్‌ను హరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని తాజాగా కలిశారు. ఈ ఫొటోలు కూడా మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ రాబోతున్నాయని, షూటింగ్ అతి త్వరలో మొదలవుతుందని మైత్రీ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈసారి బాక్సాఫీస్ బద్దల్ బాసింగాలే అంటూ అభిమానులు వెర్రెత్తిపోయే కామెంట్ కూడా జోడించారు.
రీఎంట్రీ తర్వాత పవన్ అభిమానులు ఆయన్నుంచి ఎక్కువగా కోరుకుంటున్న సినిమా ఇదే. పవన్-హరీష్ కలయికలో ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ కలయికలో మళ్లీ సినిమా అనేసరికి ముందు నుంచి ఎగ్జైట్ అవుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే సినిమా మొదలయ్యే సూచనల్లేవని సైలెంటుగా ఉన్న ఫ్యాన్స్‌కు హరీష్ అండ్ టీం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి స్వీట్ షాక్ ఇచ్చేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates