పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఎవరితో జట్టు కడతాడో తెలియని అయోమయంలో ఉన్నారు అభిమానులు. ఒక సినిమా మొదలు మధ్యలో ఇంకో సినిమాను తెరపైకి తేవడం.. దాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడం.. ముందు ప్రకటించిన సినిమాలను ఎటూ కాకుండా వదిలేయడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం.
వకీల్ సాబ్ తర్వాత నిజానికి హరిహర వీరమల్లు సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాలి. కానీ మధ్యలోకి భీమ్లా నాయక్ వచ్చింది. హరిహర వీరమల్లు మధ్యలో ఆగింది. భవదీయుడు భగత్ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. భీమ్లా నాయక్ అయ్యాక అయినా ఆ రెండు చిత్రాల సంగతి తేలుస్తాడేమో అనుకుంటే.. వినోదియ సిత్తం అనే తమిళ సినిమా రీమేక్‌లో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.
ఆ సినిమా అతి త్వరలో మొదలవుతుందని అన్నారు కానీ.. ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కాగా ఇప్పుడు పవన్ కొత్త ప్రాజెక్టు గురించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాల దర్శకుడు వేణు ఉడుగులతో పవన్ జట్టు కట్టబోతున్నట్లు చెబుతున్నారు. తన తొలి చిత్రం రిలీజైన మంచి పేరు తెచ్చుకున్నప్పుడే పవన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో ఎప్పటికైనా సినిమా తీస్తానని అన్నాడు వేణు. సమాజం పట్ల మంచి అవగాహన, గొప్ప భావజాలం ఉన్న వ్యక్తిలా కనిపించే వేణు.. పవన్‌తో మంచి ఇంటెన్సిటీ ఉన్న సినిమా తీస్తే బాగానే ఉండొచ్చు.
కానీ ఇప్పుడున్న లైనప్‌లో పవన్ అతడికి ఛాన్స్ ఎలా ఇస్తాడన్నది ప్రశ్నార్థకం. అసలే పూర్తి స్థాయి రాజకీయాలు చేయట్లేదనే విమర్శలున్నాయి పవన్ మీద. సాధ్యమైనంత త్వరగా చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఫుల్ టైం రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటుంటే ఎప్పటికప్పుడు ఇలా కొత్త సినిమాలను లైన్లోకి తేవడమేంటో అర్థం కావడం లేదు.