రగిలిపోతున్న బాలీవుడ్

ఒకప్పుడు బాలీవుడ్ ముందు టాలీవుడ్ చాలా చిన్నదిగా కనిపించేది. వాళ్ల సినిమాల స్థాయి వేరుగా ఉండేది. బడ్జెట్లు, కలెక్షన్లు ఒక రేంజిలో ఉండేవి. మన వాళ్లను తక్కుగా చూసేవాళ్లు కూడా. కానీ ఇదంతా ‘బాహుబలి’కి ముందు వరకే. ఆ సినిమా నార్త్, సౌత్ అని తేడా లేకుండా వసూళ్ల మోత మోగించేసింది. ముఖ్యంగా ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత.. ‘ది కంక్లూజన్’ మీద ఏ స్థాయిలో హైప్ నెలకొందో.. ఆ సినిమా ఎలా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసిందో తెలిసిందే.

‘బాహుబలి’కి ఏదో అలా మ్యాజిక్ జరిగిపోయిందని.. వేరే సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అనుకున్నారు. కానీ తర్వాత ‘కేజీఎఫ్’ కూడా అనూహ్యమైన వసూళ్లు సాధించింది ఉత్తరాదిన. కొన్ని నెలల కిందట ‘పుష్ప’ ఏ స్థాయిలో సంచలనం రేపిందో తెలిసిందే. ఇప్పుడిక ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం చూస్తున్నాం. నెమ్మదిగా సౌత్ సినిమాలు.. బాలీవుడ్ సినిమాలను దెబ్బ తీస్తుండటం, వాటికి భయపడి తమ చిత్రాలను హిందీ వాళ్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుండటం వారికి జీర్ణం కావడం లేదు. 

‘కేజీఎఫ్’ దెబ్బకు షారుఖ్ సినిమా ‘జీరో’ జీరో అయిపోగా.. ‘పుష్ప’ ధాటికి ‘83’ లాంటి మంచి సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడేమో సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న ‘కశ్మీర్ ఫైల్స్’ హవాకు ‘ఆర్ఆర్ఆర్’ బ్రేకులేసింది. ఇలా సౌత్ సినిమాలు నార్త్ సినిమా హాళ్లను ఆక్రమించేసి.. తమ సినిమాలను గట్టి దెబ్బ తీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితికి బాలీవుడ్ వచ్చేస్తోంది.

‘బాహుబలి’ టైంలో ఆ చిత్రాన్ని ప్రోత్సహిస్తూ అంతా పాజిటివ్‌గా మాట్లాడారు. దాని వెనుక కరణ్ జోహార్ ఉండటం అందుక్కారణం. కానీ వేరే వాళ్లకు మన ఇంట్లో ఆశ్రయమిస్తే.. వాళ్లు మనల్నే వెళ్లగొట్టి ఆ ఇంటిని ఆక్రమించుకున్న చందాన.. సౌత్ సినిమాలు బాలీవుడ్ వాళ్లకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెడుతున్నారు. దీంతో బాలీవుడ్ వాళ్లు లోలోన రగిలిపోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎవ్వరూ మాట్లాడకుండా సైలెంటుగా ఉండటం.. సౌత్ తరహాలో సినిమాలు తీయాలంటూ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేయడం నార్త్‌లో సౌత్ సినిమాల హవాతో బాలీవుడ్ ఎలా రగిలిపోతుందో చెప్పడానికి రుజువు.