రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఓ తెలుగు సినిమా అమెరికాలో రిలీజవడమే గగనంగా ఉండేది. అలాంటిది ఐదేళ్ల కిందట వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఏకంగా అక్కడ 20 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. బాహుబలి-2 వివిధ భాషల్లో కలిపి ఆ మార్కును అందుకున్నప్పటికీ బేసిగ్గా అది తెలుగు సినిమా కావడం మనకు గర్వకారణం. అంతకముందు, ఆ తర్వాత మరే సినిమా కూడా 20 మిలియన్ల మార్కును అందుకోలేదు.
‘బాహుబలి’ ఫీట్‌ను రిపీట్ చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఏ సినిమా మీదా అలాంటి అంచనాలు కూడా కలగట్లేదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’కు యుఎస్‌లో మరీ హైప్ ఏమీ లేకపోవడంతో పది మిలియన్ల క్లబ్బులో చేరుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే ఈ చిత్రం ఆ ఘనతను అందుకుంది. యుఎస్‌లో 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరిన అరుదైన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సోమవారం నాటికే 9.9 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’.. మంగళవారానికి జరిగిన ప్రి సేల్స్‌తోనే 10 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. మంగళవారం ఆఫర్ల కారణంగా సోమవారం కంటే తర్వాతి రోజు యుఎస్ వసూళ్లు ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం యుఎస్‌లో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా ఉంది. రాబోయే వీకెండ్లో పోటీ లేని నేపథ్యంలో ఇంకా వసూళ్లు పెరగడం ఖాయం. ఫుల్ రన్లో ఈ చిత్రం దాదాపు 13 మిలియన్ల మధ్య కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
యుఎస్‌లో 10 మిలియన్ల మార్కును అందుకున్న ఐదో ఇండియన్ సినిమా ఇది. బాహుబలి-2 అక్కడ 20.5 మిలియన్ డాలర్లు రాబడితే.. హిందీ చిత్రాలు దంగల్ 12.39 మిలియన్లు, పద్మావత్ 12.16 మిలియన్లు, పీకే 10.6 మిలియన్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ క్లబ్బులోకి ‘ఆర్ఆర్ఆర్’ కూడా చేరింది. మరి మూడు హిందీ చిత్రాలను దాటి బాహుబలి తర్వాత, రెండో స్థానానికి ‘ఆర్ఆర్ఆర్’ చేరుతుందేమో చూడాలి.