ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనమే సృష్టిస్తోంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే.. వసూళ్లు మెరుగ్గా ఉన్నట్లే. చాలా చోట్ల బాహుబలి రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టేస్తోంది. తెలుగు రాష్ట్రాల అవతల రిలీజ్‌కు ముందు హైప్ తక్కువగానే కనిపించినా.. తెరపై బొమ్మ పడ్డాక పరిస్థితి మారిపోయింది. దేశవ్యాప్తంగా, అలాగే దేశం అవతల కూడా ఆర్ఆర్ఆర్ వసూళ్ల మోత మోగిస్తోంది.
సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇది చిత్ర బృందాన్ని సంతోషంలో ముంచెత్తే విషయమే. ఈ చిత్రంతో రాజమౌళి ఇమేజ్ మరింత బలపడిందనడంలో సందేహం లేదు. ఇండియాలో జక్కన్నే నంబర్ వన్ డైరెక్టర్ అని మరోసారి రుజువైంది. ఆయన సినిమాల మార్కెట్ ఇంకా పెరిగిపోవడం ఖాయం. ఆయన తర్వాతి చిత్రంపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఐతే ఈ సినిమాతో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఏమేర ప్రయోజనం కలిగిందన్నది ఇప్పుడు ప్రశ్న.
కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా హిట్టయితే వీళ్లకు సరిపోదు. ఈ సినిమాతో తమకు గుర్తింపు రావడం, పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ పెరగడం, కొత్తగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ రావడం కీలకం. బాహుబలితో ప్రభాస్‌కు అవన్నీ సమకూరాయి. రాజమౌళి సపోర్ట్ లేకున్నా తర్వాత ప్రభాస్ సినిమాలకు భారీగా మార్కెట్ ఏర్పడింది. అతడి పేరు మీద సినిమాలకు వందల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అదే స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతోంది. తారక్, చరణ్‌లు ప్రభాస్‌తో పోల్చుకుంటే మాత్రం కష్టమే. బాహుబలి సినిమాకు జరిగిన మ్యాజిక్ వేరు. అందులో ప్రభాస్ ఒక్కడే హీరో. కానీ ఆర్ఆర్ఆర్‌కు యూనివర్శల్ అప్లాజ్ లేదు.
ఇందులో హీరోల పాత్రలకు బాహుబలి స్థాయి ఎలివేషన్ అయితే లేదు. పాత్రలు, లుక్స్ పరంగా కూడా ఇద్దరు హీరోలకు కొన్ని పరిమితులున్నాయి. ఐతే ఈ సినిమాతో ఉత్తరాదిన ఇద్దరు హీరోలూ మంచి పాపులారిటీ సంపాదించిన మాట వాస్తవం. ఇకపై వీళ్ల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసుకోవచ్చు. వాటికి మార్కెట్ ఉంటుంది. ఓ మోస్తరుగా బిజినెస్ కూడా జరగొచ్చు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ కోసం ఎగబడినట్లు తారక్, చరణ్‌ల కోసం బయటి రాష్ట్రాల జనాలు, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎగబడతారా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.