ఏపీలో వచ్చే ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తులకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగా ఉండాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో ఆయన ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పవన్‌కు మరో పార్టీ రూపంలో సవాలు పొంచి ఉంది. అది అధికార వైసీపీ కాదు.. ఆమ్ ఆద్మీ పార్టీ. అవును.. ఏపీలో పాగా వేయాలని చూస్తున్న ఆప్.. పవన్‌కు దెబ్బ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో బలమైన ఓటు బ్యాంకు ఏదీ అంటే వచ్చే సమాధానం కాపు సామాజిక వర్గం. దీంతో ఏపీలో పట్టు సాధించాలంటే ముందుగా ఈ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్. అందుకే ముందుగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
క్లీన్ ఇమేజ్ ఉన్న ఆ మాజీ ఐపీఎస్ అధికారిని చేర్చుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని కేజ్రీవాల్ భావిస్తున్నారంటా. ఇక తమిళనాడులో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కూడా పార్టీలో చేర్చుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులు తన సొంత నియోజకవర్గమైన కాపు ముద్ర తన మీద పడకుండా పవన్ జాగ్రత్త పడ్డారనే అభిప్రాయాలున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే కాపులను కలుపుకొని పోవాల్సిందేనని పవన్ అనుకుంటున్నారని సమాచారం.
అందుకే ఆయన ఈ మధ్య కాపు మాట ఎత్తుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా కాపులను తమ వైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ రానున్న ఆయన.. ఈ సందర్భంగా కీలక నేతలతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఆప్ సిద్ధాంతం.. అలాగే కాపు ఓటు బ్యాంకు కలిస్తే రాజకీయంగా అద్భుతాలు సృష్టించవచ్చని కేజ్రీవాల్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యమై ఆప్‌కు కాపుల మద్దతు దొరికితే మాత్రం పవన్‌కు షాక్ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates