సంచలనం.. ఆర్ఆర్ఆర్ ప్రపంచ నంబర్ వన్

రంగం ఏదైనా సరే.. ఇండియా ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. క్రీడలు సహా అనేక రంగాల్లో ఇండియా అగ్ర స్థానంలో నిలవడం చూస్తుంటాం కానీ.. సినిమాల విషయంలో మాత్రం అది సాధ్యం కాదు. ప్రపంచ సినిమా ముందు ఇండియన్ సినిమా ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది. మన సినీ పరిశ్రమతో పోలిస్తే హాలీవుడ్ రేంజ్ చాలా చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా వాటికి ఉండే మార్కెట్ వేరు.

కాబట్టి ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ సినిమాలను దాటి ఒక వీకెండ్లో ఓ భారతీయ చిత్రం అగ్రస్థానంలో నిలవడం అన్నది ఊహకందని విషయమే. బాలీవుడ్లో వచ్చిన ఎన్నో భారీ చిత్రాలకు కూడా ఇది సాధ్యం కాని ఫీట్‌గానే ఉండిపోయింది. కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఈ అరుదైన ఘనతను అందుకుంది ప్రపంచ సినిమా పండిట్లను ఆశ్చర్యపరిచింది. మార్చి 25-27 మధ్య వీకెండ్లో ప్రపంచం మొత్తం మీద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’యే కావడం విశేషం.

ఈ వారాంతంలో ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.480 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. హాలీవుడ్ మూవీ ‘బ్యాట్ మన్’ రూ.350 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ‘బ్యాట్ మ్యాన్’ కొత్త సినిమా కాకపోయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లే రాబడుతోంది. దాని మార్కెట్ పరిధిలా చాలా ఎక్కువ. అలాంటి సినిమాను వెనక్కి నెట్టి ‘ఆర్ఆర్ఆర్’ పెద్ద తేడాతో అగ్ర స్థానంలో నిలవడం సంచలనమే. ఓవరాల్‌గానే కాక యుఎస్ బాక్సాఫీస్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కొనసాగుతోంది.

అక్కడ తొలి వీకెండ్లో ఈ చిత్రం 9.5 మిలియన్ డాలర్ల దాకా కొల్లగొట్టడం విశేషం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ సోమవారం రూ.500 కోట్ల గ్రాస్ మార్కును దాటేయబోతోంది. ఎక్కడిక్కడ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.1000 కోట్ల గ్రాస్ మార్కును దాటేయడం కూడా లాంఛనంగానే కనిపిస్తోంది. సోమవారం వసూళ్లలో డ్రాప్ ఉన్నప్పటికీ.. మరీ ఎక్కువ అయితే లేదు. రాబోయే వీకెండ్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.