ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్.. రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఏది హైలైట్ అవుతుందనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఈ విషయంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పట్నుంచో ఫైట్ నడుస్తోంది. ఐతే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి పాత్ర పరంగా తన ఫేవరెట్ చరణ్ చేసిన రామరాజు క్యారెక్టరే అన్నాడు.
ఇప్పుడు రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ కథకుడు విజయేంద్ర ప్రసాద్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆర్ఆర్ఆర్‌లోని రెండు ప్రధాన పాత్రలను విశ్లేషించారు. ఈ రెండు పాత్రల్లో తనకు ఏది ఎక్కువ ఇష్టమో వెల్లడించారు.
ట్రైలర్ సహా ప్రోమోల్లో చూస్తే కొమరం భీమ్ వెంటనే ఆకట్టుకుంటుందని, అడవి బిడ్డ పాత్ర చేయడం వల్ల ఆ పాత్ర చూడగానే ఆకట్టుకుంటుందని, అడవిలో ఒక పువ్వునో, ఒక జంతువునో చూస్తే అవి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తాయో అలాంటి పాత్రే ఇదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక చరణ్ చేసిన రామరాజు పాత్ర గురించి చెబుతూ.. ఇది సంక్లిష్టమైన పాత్ర అని, దీనిలో చాలా లేయర్స్ ఉంటాయని.. లోలోన ఎంతో బాధ పడుతూ, సంఘర్షణ అనుభవించే పాత్ర ఇదని అన్నారు.
సినిమాలో తారక్ చరణ్‌ను అన్న అని పిలుస్తాడని, కాబట్టి చరణ్ చేసింది పరిణతితో కూడిన, పెద్ద వాడి పాత్ర అని.. ఈ పాత్రను పోషించడం కూడా చాలా కష్టమని విజయేంద్ర అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, కానీ ఈ సినిమా వరకు రామ్ చరణ్‌కు తాను రెండు మార్కులు ఎక్కువ వేస్తానని.. ఇందుకు పాత్రలో ఉన్న సంక్లిష్టత, లేయర్సే కారణమని విజయేంద్ర విశ్లేషించారు. బేసిగ్గా అల్లూరి సీతారామరాజు అంటే బాగా పాపులర్ అయిన క్యారెక్టర్,పైగా తెలుగువాళ్లకు దాంతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వల్ల దీనికే సినిమాలో ఎలివేషన్ ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగని తారక్ చేసిన భీమ్ పాత్రను రాజమౌళి తగ్గించి అయితే ఉండడు, బ్యాలెన్స్ చేయడానికే ప్రయత్నించి ఉంటాడని భావించవచ్చు.