రాజమౌళి చేసిన మోసం

మన దర్శక ధీరుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ఒక సన్నివేశమైనా, ఒక ఫైట్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా రావడం కోసం ఎన్ని టేకులైనా తీసుకుంటాడని.. ఈ క్రమంలో ఆర్టిస్టులను రాచి రంపాన పెడతాడని ఆయనకు పేరుంది.

ఈ అనుభవాల గురించి చాలామంది నటీనటులు, టెక్నీషియన్లు ఆయన పెట్టే టార్చర్ గురించి సరదాగా చెబుతుంటారు. ఇక రాజమౌళికి బాగా క్లోజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి మీద చేసిన కంప్లైంట్లు అన్నీ ఇన్నీ కావు. ‘నాటు నాటు’ పాటలో హుక్ స్టెప్ కోసం కొన్ని వారాల పాటు ప్రాక్టీస్ చేసిన ఎంతో పర్ఫెక్ట్‌గా ఆ మూమెంట్ చేస్తే.. 17 టేక్‌లు తీసుకున్నట్లు తారక్ చెప్పడం గమనార్హం.

ఇన్ని టేక్‌లు తీసుకుని చివరికి రెండో టేక్‌నే ఓకే చేసేశాడట జక్కన్న.ఇదంతా ఒక ఎత్తయితే.. ముంబయిలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ కోసం కూడా తమను జక్కన్న పెట్టిన కష్టం అంతా ఇంతా కాదంటూ ఒక సీక్రెట్ వెల్లడించాడు. ఈ ఈవెంట్లో భాగంగా గాల్లోంచి తారక్ బుల్లెట్ మీద, చరణ్ గుర్రం మీద దిగడం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. ప్రమోషన్లలో ఇది ఇంకో లెవెల్ అంటూ అందరూ దీన్ని కొనియాడారు. ఐతే ప్రేక్షకులు చూసిన ఈ దృశ్యం ‘రియల్’ లొకేషన్లో జరిగింది కాదని తారక్ చెప్పాడు.

చాలా రోజుల పాటు రిహార్సల్స్ చేసి ముంబయిలో ఈవెంట్ జరిగిన ప్రదేశంలో నిజంగానే గాల్లో గుర్రం, బుల్లెట్ల మీద చరణ్, తారక్ దిగడం వాస్తవమేనట. కానీ ఈవెంట్ పూర్తి చేసుకుని విమానంలో తిరిగి వస్తున్న టైంలో రాజమౌళి తనయుడు కార్తికేయ.. పెద్ద బాంబు పేల్చాడని, లైటింగ్ సరిగా లేక ఈ దృశ్యం అనుకున్నంత బాగా రాలేదన్నాడని.. దీంతో విజువల్స్ చూసేటపుడు ప్రేక్షకులు నిరాశ పడతారనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో అచ్చం అలాంటి సెట్టే వేసి ఈ దృశ్యాన్ని మళ్లీ షూట్ చేశారని.. ఒరిజినల్ వీడియోలో ఆ మూమెంట్ దగ్గర దీన్ని రీప్లేస్ చేశారని.. ఇలా జక్కన్న ప్రేక్షకులకు అది ఒరిజినల్ లొకేషన్లో జరిగినట్లుగా భ్రమ కల్పించాడని తారక్ వెల్లడించాడు. రాజమౌళి పర్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో, ఇందుకోసం ఆర్టిస్టులను ఎంత కష్టపెడతాడో ఉదాహరణగా దీన్ని చూపించాడు తారక్.