మెయింటైనెన్స్ ఖర్చులురాబట్టని కొత్త సినిమా

ముందు వారం ‘రాధేశ్యామ్’, తర్వాతి వారం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజవుతుండటంతో మధ్యలో ఒక వారం ఖాళీ పడటం.. ఆ భారీ చిత్రాలకు భయపడి వేరే పేరున్న సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ఇదే మంచి ఛాన్సని రాజ్ తరుణ్ కొత్త చిత్రం ‘స్టాండప్ రాహుల్’ను దించేశారు దాని నిర్మాతలు. ఎక్కువగా మాస్ టచ్ ఉన్న కామెడీ సినిమాలే చేసి గట్టి ఎదురు దెబ్బలు తిన్న రాజ్ తరుణ్.. తన ఫ్లాపుల పరంపర నుంచి బయట పడటానికి కొంచెం భిన్నమైన ప్రయత్నం చేశాడీ చిత్రంతో.

స్టాండప్ కమెడియన్‌గా కొత్త తరహా పాత్రను ఎంచుకుని లుక్స్, యాక్టింగ్ పరంగా మేకోవర్ ట్రై చేశాడు. దీని ప్రోమోలు చూస్తే విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది. అర్బన్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారనిపించింది. కానీ తీరా సినిమా చూస్తే.. ఎటూ కాకుండా తయారైంది. రాజ్ ఎప్పుడూ చేసే మాస్ కామెడీ సినిమాలకు అంతో ఇంతో ఆదరణ ఉండేది. కానీ ఈ సినిమాపై ఆ వర్గం ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.

ఇక కొత్తదనం కోరుకునే ప్రేక్షకులనూ ఇది మెప్పించలేదు.రాజ్ గత సినిమాల ప్రభావం ఏ స్థాయిలో పడిందంటే.. తొలి రోజు మార్నింగ్ షోలకు 10 శాతం ఆక్యుపెన్సీ కూడా రాని పరిస్థితి. సింగిల్ డిజిట్ ఆడియన్స్‌తో చాలా షోలు నడిచాయి. అసలే హైప్ లేదు. పైగా పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో ‘స్టాండప్ రాహుల్’ వీకెండ్లోనే చతికిలపడింది. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి తలెత్తింది.

షో వేస్తే ఆదాయం రాకపోగా.. అదనంగా ఖర్చవుతుంటే సినిమాను నడిపించడం ఎలా? ఈ పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి లేపేశారు. వీకెండ్ తర్వాత ‘స్టాండప్ రాహుల్’ అడ్రస్ లేకుండా పోయింది. టాక్ బాగుండి వసూళ్లు లేకపోయినా కనీసం ఓటీటీ డీల్ అయినా బాగా కుదురుతుంది. కానీ ఈ చిత్రానికి రెండూ లేకపోయాయి. మరి ముందే సినిమాను అమ్మి బయటపడ్డారేమో తెలియదు. దారుణంగా దెబ్బ తిన్న రాజ్ తరుణ్ కెరీర్‌ను ఈ సినిమా చక్కదిద్దుతుందేమో అనుకుంటే.. అతణ్ని ఇంకా కిందికి లాగేసిందీ. మార్కెట్ దాదాపు జీరో అయిపోయిన నేపథ్యంలో రాజ్ ఇక కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.