మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఏంటో ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల తరం అయ్యాక తెలుగులో నంబర్ వన్ హీరోగా దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన ఘనత ఆయన సొంతం. చిరు అందుకున్న విజయాలు, ఆయన సినిమాల కలెక్షన్లు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇదంతా కూడా ఒక చరిత్ర. ఒక సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి ఇండియాలోనే అత్యధిక పారితోషకం అందుకున్న హీరోగా రికార్డు నెలకొల్పిన ఘనత ఆయనది.
80, 90 దశకాల్లో ఆయన హవా మామూలుగా నడవలేదు. సాధారణ ప్రేక్షకులే కాదు.. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనకు అభిమానులే అంటే అతిశయోక్తి కాదు. చిరు స్ఫూర్తితో హీరోలైన వాళ్ల జాబితా చాలా పెద్దదే. వేరే భాషలకు చెందిన స్టార్లు సైతం చిరుకు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదు.
తాజాగా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్.. మెగాస్టార్‌కు గొప్ప ఎలివేషన్ ఇచ్చి ఆయన స్థాయి ఏంటో అందరికీ చాటి చెప్పాడు. చిరు తనయుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రధారుల్లో ఒకడిగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో ఆమిర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్, చరణ్‌లతో కలిసి ఆయన నాటు నాటు స్టెప్ వేసి అందరినీ ఆలరించాడు.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆమిర్‌కు తాను ఎప్పట్నుంచో చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పగా.. పక్కనే ఉన్న ఆమిర్ మైక్ అందుకుని, నేను అంతకంటే ముందు నుంచే మీ నాన్న చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషం. ఆమిర్ స్థాయి హీరో చిరుకు తాను పెద్ద ఫ్యాన్ అని ఇలా ఒక బహిరంగ వేడుకలో చెప్పడం గొప్ప విషయం. చిరు స్థాయి ఏంటో చెప్పడానికి ఇది రుజువు అనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates