మంచి క్రేజ్ ఉన్న సినిమా.. దాని నిర్మాతలకు బాగా నమ్మకం ఉంటే రిలీజ్‌కు ముందు రోజే సెకండ్ షోకు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. గతంలో అర్జున్ రెడ్డి, బాహుబలి-2, ఫలక్ నుమా దాస్ లాంటి కొన్ని సినిమాలకు ఇలాగే జరిగింది. వీటిలో అర్జున్ రెడ్డి, బాహుబలి-2 సినిమాలకు ప్రిమియర్స్ బాగా కలిసొచ్చాయి కూడా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి హైప్ మరింత పెరిగింది.
గత వారం విడుదలైన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్‌కు కూడా ఇలాగే ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఎందుకో ఆ ఆలోచనను మానుకున్నారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చేందుకు ఆస్కారముందని, అది సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించి వెనక్కి తగ్గినట్లుగా వార్తలొచ్చాయి.
ఐతే వచ్చే శుక్రవారం విడుదల కానున్న రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌కు పెయిడ్ ప్రిమియర్స్ పక్కా అని ఇంతకుముందే వార్తలొచ్చాయి.
సంక్రాంతి రిలీజ్ టైంలోనే ఇలా ప్లాన్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. దీని గురించి అప్పట్లో రాజమౌళి సైతం స్పందించాడు. ఐతే సినిమా అనుకోకుండా మార్చి 25కు వాయిదా పడింది. ఇప్పుడు కూడా పెయిడ్ ప్రిమియర్స్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు కొన్ని రోజుల ముందు వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను డిస్ట్రిబ్యూటర్లు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలేంటన్నది తెలియదు. సినిమా మీద సందేహాలైతే ఎవరికీ లేవు.
రాజమౌళి అండ్ కో చాలా కాన్ఫిడెంట్‌గా ఉందీ సినిమాపై. బాక్సాఫీస్ దగ్గర బాహుబలి స్థాయి సంచలనాలు ఖాయం అనే అంతా ధీమాగా ఉన్నారు. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నపుడు పెయిడ్ ప్రిమియర్స్ ఆలోచన ఎందుకు విరమించుకున్నారో తెలియదు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున రెండు షోలు పడే అవకాశాలున్నాయి. తర్వాత ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో రెగ్యులర్ షోలు మొదలు కానున్నాయి. ఏపీలో సైతం ఐదో షోకు అనుమతులుండటంతో అదే సమయంలో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.