బంగారం లాంటి ఛాన్సులు.. ఇలా చేశారేంటి?

ఒక్క సినిమాతో ఒక హీరో మార్కెట్ పది రెట్లకు మించి పెరిగింది. ఇండియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విస్తరించింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇలాంటి హీరోతో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం లభిస్తే ఆ నిర్మాతలకు అంతకంటే ఆనందం ఏముంది? బంపర్ ఆఫర్లు కొట్టేసినట్లే కదా. కథల ఎంపికలో పక్కాగా ఉండి.. మేకింగ్ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుని.. ఆ హీరో స్థాయికి తగ్గ సినిమాలు తీసి తాము మంచి లాభాలు అందుకోవడంతో పాటు అందరినీ సంతోష పెట్టాలి కదా? కానీ యువి క్రియేషన్స్ వాళ్లు బంగారం లాంటి ఈ ఛాన్సుల్ని వృథా చేసుకున్నారు.

‘బాహుబలి’ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌తో.. వెంటనే వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశాలు వస్తే వాటిని వాళ్లు సరిగా ఉపయోగించుకోలేదు. రెండేళ్ల ముందు ‘సాహో’, ఇప్పుడు ‘రాధేశ్యామ్’ చిత్రాలతో ప్రభాస్‌కు చేదు అనుభవాలను మిగిల్చారు. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు.యువి క్రియేషన్స్ అంటే ముందు నుంచి ప్రభాస్ అభిమానులకు ప్రతికూల అభిప్రాయమే ఉంది.

సినిమాలను సరిగా ప్రమోట్ చేయరని, షూటింగ్ మరీ ఆలస్యం చేస్తారని, సరైన సమయంలో అప్‌డేట్స్ ఇవ్వరని.. ఇలా వారి నుంచి చాలా కంప్లైంట్లే ఉన్నాయి ప్రభాస్ ఫ్యాన్స్‌లో. ఆ సంస్థకు వ్యతిరేకంగా దాని ఆఫీస్ ముందు గొడవ చేసే వరకు వెళ్లింది ఒక దశలో పరిస్థితి. ఐతే మేకింగ్ టైంలో వాళ్లు ఏం చేసినా, ఎలా వ్యవహరించినా.. సరైన సినిమాలు తీస్తే అదే చాలనుకున్నారు. కానీ రెండు సినిమాల విషయంలోనూ నిరాశనే మిగిల్చారు.

ప్రభాస్ అన్నీ యువి వాళ్లకు వదిలేస్తే.. వాళ్లు దర్శకులు, కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించలేదని.. కంటెంట్ మీద కాకుండా అదనపు హంగుల మీదే దృష్టిపెట్టారని.. అయిన కాడికి బడ్జెట్లు పెట్టడం, డాబు చూపించడం తప్పితే.. సినిమాకు అత్యంత కీలకమైన కథాకథనాల మీద దృష్టిపెట్టలేదని.. అందుకే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయని.. వాళ్ల వరకు రెండు సినిమాలకూ బాగానే బిజినెస్ చేసుకుని బయటపడ్డా.. బయ్యర్లు మునిగిపోయారని, అభిమానులకూ ఆవేదనే మిగిలందని యువి అధినేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.