రామ్-బోయ‌పాటి.. హీరోయిన్ ఫిక్స్

టాలీవుడ్లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. మాస్ చిత్రాల‌కు పెట్టింది పేరైన బోయ‌పాటి శ్రీను.. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌తో జ‌ట్టు క‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. వీరి క‌ల‌యిక‌లో ఇటీవ‌లే సినిమాను అనౌన్స్ చేశారు. కొన్నేళ్ల ముందు వ‌ర‌కు మీడియం రేంజ్ డైరెక్ట‌ర్లతో మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వ‌చ్చాడు రామ్. కానీ పూరి జ‌గ‌న్నాథ్‌తో అత‌ను చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయి అత‌డి రేంజ్ పెంచింది.

ఇప్పుడు రామ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో వారియ‌ర్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త‌న కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లే ద‌ర్శ‌కుడి కోసం చూస్తున్న అత‌డికి అఖండ‌తో భారీ విజ‌యాన్నందుకున్న బోయ‌పాటితో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. రామ్‌తో వారియ‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస్ చిట్టూరినే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి న‌టీన‌టుల ఎంపిక‌, ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రంతో రామ్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టించ‌బోతోంద‌ట‌. ఓవైపు మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ల‌తో సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు మీడియం రేంజ్ హీరోల‌తోనూ జ‌ట్టు క‌డుతోంది ర‌ష్మిక‌.

ఇటీవ‌లే ఆమె శ‌ర్వానంద్‌తో ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు చేసింది. ఆ సినిమా నిరాశ ప‌రిచింది. ప్ర‌స్తుతం తెలుగులో ఆమెకు పుష్ప‌-2 త‌ప్ప సినిమాలేమీ లేవు. ఇలాంటి టైంలో రామ్-బోయ‌పాటి సినిమాకు అడిగేస‌రికి ఒప్పేసుకుంది. రామ్.. వారియ‌ర్ చిత్రాన్ని పూర్తి చేసిన అనంత‌రం ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. రామ్ ఎన‌ర్జీని పూర్తిగా వాడుకుంటూ.. త‌న స్ట‌యిల్ మాస్ మిస్ కాకుండా భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాల‌ని బోయ‌పాటి చూస్తున్నాడ‌ట‌.