మంచో చెడో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ సినీ ప్రేమికుల చర్చలన్నీ ‘రాధేశ్యామ్’ చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా మహమ్మారి మొదలయ్యాక ఇండియాలో రిలీజైన అతి పెద్ద సినిమా ఇదే. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. ఐతే ఇది తీసిపడేసే సినిమా అయితే కాదు. చెప్పుకోదగ్గ ఆకర్షణలు ఉన్న సినిమానే. విజువల్‌గా ‘రాధేశ్యామ్’ టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింట్‌ను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక ఇందులో సెట్టింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్ మాత్రమే కాదు.. సంగీత దర్శకులు, సౌండ్ డిజైనర్, ఇతర సాంకేతిక నిపుణులు మంచి పనితీరును కనబరిచారు. యువి క్రియేషన్స్ వాళ్లు అవసరానికి మించే సినిమా మీద ఖర్చు పెట్టారు. టెక్నికల్‌గా ‘రాధేశ్యామ్’ టాప్ క్లాస్ అనడంలో సందేహం లేదు.కానీ ఇలాంటి అదనపు ఆకర్షణలతో సినిమా పాసైపోదు. వీటికి మించి కథాకథనాలు అత్యంత కీలకం. అవి బాగుంటే నిజానికి సాంకేతిక హంగులు తక్కువగా ఉన్నా బండి నడిచిపోతుంది.
ఈ అదనపు ఆకర్షణలను పెద్దగా పట్టించుకోరు. కథాకథనాలు బాగుంటే ఈ ఆకర్షణలు ప్లస్ అవుతాయి తప్ప.. అవి బాలేనపుడు కేవలం ఆ హంగులు సినిమాను నిలబెట్టలేవు. ‘రాధేశ్యామ్’ విషయంలో ఇదే జరిగింది. కథాకథనాల్ని మించి సాంకేతిక హంగులే హైలైట్ అయ్యాయి. అందరూ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా చూడటానికి వీటిని కారణాలుగా చూపిస్తున్నారు.
కానీ ఈ హంగులను తీసేసి ఒకసారి ‘రాధేశ్యామ్’ను ఊహించుకుంటే చాలా సాధారణమైన సినిమాలాగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలా విజువల్‌గా ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకుండా కేవలం అసలు కథ మాత్రమే చెప్పినపుడు ప్రభాస్ అండ్ కో రియాక్షనేంటి.. వాళ్లకు ఈ కథలో అంత ప్రత్యేకంగా ఏం కనిపించింది.. ఏ సన్నివేశాలు అంత ఎగ్జైట్ చేశాయి.. అంత మంది ఈ కథను నమ్మి వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా ఎలా చేసేశారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయిప్పుడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates