ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి చాలా రోజులైంది. కేవలం జీవో బయటికి రావడమే తరువాయి అన్నారు. కానీ ఏవేవో కారణాలు చెప్పి దాన్ని ఆలస్యం చేశారు. ఈలోపు ‘భీమ్లా నాయక్’ సినిమాను థియేటర్లలోకి దించేశారు. ఈ సినిమా రిలీజైన పది రోజులకే టికెట్ల రేట్ల పెంపుతో జీవో వచ్చేసింది. ఇది చూసిన వాళ్లు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేమో.. సెకండ్ ఆప్షన్‌గా పెట్టుకున్న ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ వాస్తవం ఏంటంటే.. ‘భీమ్లా నాయక్’కు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త రేట్ల ద్వారా ప్రయోజనం కలగకూడదని జగన్ సర్కారు పట్టుదలతో ఉందన్నది స్పష్టం. అందుకే ఉద్దేశపూర్వంగా జీవోను ఆపి ఉంచారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్. సరిగ్గా ‘భీమ్లా నాయక్’ సెకండ్ వీకెండ్ రన్ ముగియగానే ఈ జీవోకు ఆమోద ముద్ర వేయడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని అర్థం చేసుకునే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రిలీజ్ విషయంలో పచ్చ జెండా ఊపేశాడని అంటున్నారు.
ఇదే విషయాన్ని ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఈసీ సభ్యుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు హామీ ఇచ్చి మరీ పవన్ ఈ సినిమాను రిలీజ్ చేయించినట్లు అతను వెల్లడించాడు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో గురించి అతను ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘‘తన సినిమా రిలీజైతే కానీ ప్రభుత్వం జీవో ఇవ్వదని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు.
తన వల్ల ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పడుతుందని భావించి.. ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లతో సంబంధం లేకుండా సినిమాను రిలీజ్ చేసేయాలని డిస్ట్రిబ్యూటర్లకు ఆయన చెప్పారు. దీని వల్ల ఏ నష్టం వచ్చినా నేను సొంతంగా భరిస్తాను అని డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది’’ అని సత్యనారాయణ ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘వకీల్ సాబ్’ టైంలో జీవో నంబర్ 35ను జారీ చేసి.. ‘భీమ్లా నాయక్’ రన్ ముగియగానే ఆ జీవోను వెనక్కి తీసుకోవడంలో ప్రభుత్వం ఉద్దేశమేంటో అందరికీ తెలుసని సత్యనారాయణ వ్యాఖ్యానించాడు.