పార్టీ విషయంలో జగన్ తాజా నిర్ణయం

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివేట్ చేయాలని డిసైడ్ చేశారు. ఎన్నికలకు ఉన్న రెండేళ్ల కాలాన్ని మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు జనాల్లోనే తిరగాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. జూలైలో పార్టీ ప్లీనరీని నిర్వహించబోతున్నట్లు జగన్ చెప్పారు. 2017లో వైజాగ్ లో ప్లీనరీ జరిగిన విషయం తెలిసిందే.

అంటే ఐదేళ్ల నుంచి పార్టీ ప్లీనరీ జరగలేదు. ఇదే విషయం పార్టీ నేతల మధ్య చర్చ కూడా జరుగుతోంది. జగన్ పార్టీకి సమయం కేటాయించటం లేదని, ఎంఎల్ఏలకు సరైన సమయం ఇవ్వటం లేదని పార్టీలోనే అసంతృప్తి ఉంది. బహుశా జగన్ దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్ళుంటాయి. అందుకనే మంత్రులందరు వారంలో మూడు రోజులు పార్టీకి కేటాయించాలని చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలందరు పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు.

మంత్రులు, ఎంఎల్ఏలు రెగ్యులర్ గా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని జనాలకు వివరించాలని చెప్పారు. అలాగే ఏప్రిల్లో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వాలంటీర్లందరికీ సన్మానం చేయాలని ఆదేశించారు. వాలంటీర్ల వ్యవస్ధ చాలా పటిష్టంగా పనిచేస్తోందని జగన్ అభినందించారు. అభివృద్ధి పనుల కోసమే ప్రతి నియోజకవర్గానికి రు. 2 కోట్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగన్ చెప్పారు.

మంత్రులు, ఎంఎల్ఏలు ఒక క్యాలెండర్ ను రెడీ చేసుకుని దాని ప్రకారమే గ్రామాలు, మండలాల్లో పర్యటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎంఎల్ఏలు ఇంటింటికి వెళ్ళి జనాలను పలకరించాలని కూడా చెప్పారు. మొత్తానికి జగన్ చెప్పిన మాటలు చూస్తుంటే రాబోయే ఎన్నికలకు మంత్రులు, ఎంఎల్ఏలను ఫుల్లుగా  ప్రిపేర్ చేస్తున్నట్లే ఉంది. ఇదే సమయంలో పార్టీకి జగన్ తగిన సమయం కేటాయించలేదనే అసంతృప్తిని తొలగించాలని కూడా అనుకున్నట్లున్నారు. అందుకనే ప్లానరీ అని, శాసనసభాపక్ష సమావేశమని, ఎంఎల్ఏలతో తరచు సమావేశాలని జగన్ చెప్పింది.