రాధేశ్యామ్ క్లైమాక్స్.. టైటానిక్ క‌న్నా గొప్ప‌గా

ఈ హెడ్డింగ్ చూస్తే మ‌రీ అతిశ‌యోక్తిలా అనిపించొచ్చు కానీ.. ఈ మాట అన్న‌ది మామూలు వ్య‌క్తి అయితే కాదు. ఆస్కార్ అవార్డు గెలిచిన సౌండ్ డిజైన‌ర్ ర‌సూల్ పొకుట్టి. ముంబ‌యిలో రాధేశ్యామ్ రిలీజ్ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా ర‌సూల్ ఈ వ్యాఖ్య చేశారు. సౌండ్ డిజైనింగ్ చేయ‌డంలో భాగంగా ఈ సినిమా క్లైమాక్స్ చూసి తాను స్ట‌న్ అయిపోయాయ‌ని.. అది టైటానిక్ సినిమా ప‌తాక ఘ‌ట్టం కంటే మిన్న‌గా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ మాట తాను ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్‌తోనూ అన్న‌ట్లు ర‌సూల్ వెల్ల‌డించారు. ఈ సినిమాలో ఇంకా చెప్ప‌డానికి చాలా విశేషాలున్నాయ‌ని.. కానీ వాటిని ఇప్పుడే తాను వెల్ల‌డించాల‌నుకోవ‌ట్లేద‌ని చెబుతూ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాడు ర‌సూల్. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియ‌న్ ఈ మాట అన్నాడంటే రాధేశ్యామ్ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్‌గానే ఉంటుంద‌ని భావించ‌వ‌చ్చు.

రాధేశ్యామ్ ప‌తాక ఘ‌ట్టాలు భారీ నౌక‌ నేప‌థ్యంలో న‌డుస్తాయ‌ని ట్రైల‌ర్ చూసిన‌పుడే అర్థ‌మైంది. ప్ర‌భాస్ గ‌త సినిమాల్లో మాదిరి యాక్ష‌న్ లేక‌పోయినా.. ఇందులో భారీత‌నానికి లోటు లేద‌ని, విజువ‌ల్ ఫీస్ట్ అనిపించే స‌న్నివేశాలు ఉంటాయ‌ని రెండు ట్రైల‌ర్లు చూస్తే అర్థ‌మైంది. స‌ముద్రంలో ప్ర‌ళ‌యం చోటు చేసుకుని భారీ నౌక త‌ల‌కిందుల‌వుతున్న దృశ్యాలు ట్రైల‌ర్ల‌లో క‌నిపించాయి.

ఈ స‌న్నివేశాలు ఇప్ప‌టి టెక్నాల‌జీతో ప్ర‌పంచ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలోనే తీర్చిదిద్దిన‌ట్లున్నారు. అందుకే టైటానిక్ క్లైమాక్స్‌ను మించి రాధేశ్యామ్ ప‌తాక స‌న్నివేశాలు ఉంటాయ‌ని ర‌సూల్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన‌ట్లున్నాడు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌తో పోలిస్తే.. తాజాగా విడుద‌ల చేసిన రిలీజ్ ట్రైల‌ర్ మెరుగ్గా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ నెల 11న రాధేశ్యామ్ వివిధ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.