అద్భుతమైన నటనతో అలరిస్తున్నారే తప్ప చాలా యేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కమల్ హాసన్. అయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. కానీ ఈసారి హిట్టు కొట్టే చాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దానికి వాళ్లు చెబుతున్న కారణం.. ప్రస్తుతం కమల్ నటిస్తున్న ‘విక్రమ్’ సిసిమా నాన్ థియేట్రికల్ రైట్స్ని నూట యాభై కోట్లకి అమ్మినట్లు తెలియడమే. ఇది చిన్న విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర కమల్ సినిమా లాభాలు రాబట్టి చాలా కాలమే అయ్యింది. ఇలాంటి సమయంలో ఆయన సినిమాకి ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం నిజంగా విశేషమే.
లోకేష్ కనకరాజ్ తీస్తున్నాడు కాబట్టి కమల్‌కి ఈసారి హిట్ గ్యారంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఖైదీ, మాస్టర్ లాంటి చిత్రాలను తన టేకింగ్‌తో అతను ఏ స్థాయిలో నిలబెట్టాడో ఇప్పటికే ప్రేక్షకులు చూశారు. అలాంటి డైరెక్టర్‌కి కమల్ లాంటి మహానటుడు దొరికాడంటే మరింత అదరగొట్టే అవకాశం ఉంది కదా. దానికి తోడు మరో ఇద్దరు వెర్సటైల్ యాక్టర్స్ని కీలక పాత్రలకి లాక్ చేసి సినిమా స్థాయినే మార్చేశాడు లోకేష్.
కమల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ని మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్నాడు. కమల్ తర్వాత అంత గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న హీరోలు వీళ్లిద్దరూ. అందుకే వీళ్లు ఈ సినిమాలో నటిస్తున్నారనేసరికి ఒక్కసారిగా మూవీ రేంజ్ పెరిగిపోయింది. ముగ్గురు మహానటుల్ని ఒక్కచోటికి చేర్చిన ఈ సినిమాకి ఆమాత్రం బిజినెస్ జరగాలి కదా మరి.
ఓటీటీ, శాటిలైట్ రైట్స్ని ప్రముఖ సంస్థలు తీసుకున్నాయట. అందుకోసం నిర్మాతకి నూట పదిహేను కోట్లు చెల్లించాయట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ముప్ఫై ఏడు కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్సే ఇలా ఉంటే ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ ముగ్గురు హీరోల అభిమానులూ అప్పుడే లెక్కలు కూడా వేసేస్తున్నారు. వారి అంచనాలను లోకేష్ నిలబెడితే మంచిదే మరి.