మంచు విష్ణు ఆఫీస్ లో సొంత హెయిర్ స్టైలిస్ట్ చోరీ

మంచు విష్ణు వార్తల్లోకి వచ్చారు. అదేం కొత్త విషయం కాదు కదా? అనొచ్చు. కానీ.. ఆయన ఈసారి వార్తల్లోకి వచ్చింది రోటీన్ కు భిన్నమైన అంశంలో. ఆయన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను అనే వ్యక్తి తన ఆఫీసులో చోరీ చేసినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చారు. కాస్త ఆలస్యంగా బయటకువచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే..

బోరబండకు చెందిన నాగశ్రీను అనే హెయిర్ స్టైలిస్ట్ మంచు విష్ణు దగ్గర పని చేస్తున్నారు. ఫిబ్రవరి 17న జూబ్లీహిల్స్ లోని సీబీఐ కాలనీలో మంచు విష్ణుకు ఒక ఆఫీసు ఉంది. అందులో నుంచి మేకప్ సామాగ్రి.. హెయిర్ డ్రెస్సింగ్ కు సంబంధించి దాదాపు రూ.5లక్షలు విలువైన సామాగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనతో తీసుకెళ్లిపోయాడు.

అనంతరం అతన్ని కాంటాక్టు చేసేందుకు ఫోన్ లో ప్రయత్నం చేయగా.. అతని ఫోన్ స్విచ్ఛాప్ లో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. విష్ణు లీగల్ మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఈ నెల 19న కంప్లైంట్ చేశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

చోరీ అంటే డబ్బు.. విలువైన ఆభరణాలను చోరీ చేయటం మామూలే. అందుకు భిన్నంగా హెయిర్ డ్రెస్సింగ్ కు సంబంధించిన సామాను.. మేప్ సామాగ్రిని చోరీ చేయటమా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు. ఏమైనా.. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన హెయిర్ స్టైలిస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. విషయాలన్ని వాటంతట అవే బయటకు రావటం ఖాయం.