మాస్ సినిమా థియేట‌ర్ల‌లో.. క్లాస్ సినిమా ఓటీటీలో

మ‌న దేశంలో మంచి క్వాలిటీతో, ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో సినిమాలు తీసే ఫిలిం ఇండ‌స్ట్రీల్లో మాలీవుడ్ ఒక‌టి. బ‌డ్జెట్లు త‌క్కువే కానీ.. కంటెంట్ ప‌రంగా వాళ్లు చాలా ఉన్న‌త స్థాయిలో ఉంటారు. ఐతే మ‌ల‌యాళ సినిమాల మార్కెట్ ప‌రిధి త‌క్కువ, అందుకు త‌గ్గ‌ట్లే బ‌డ్జెట్లు ఉంటాయి. వాళ్ల సినిమాల‌కు ముందు నుంచి జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులైతే బాగా వ‌స్తుంటాయి కానీ.. మ‌ల‌యాళం అర్థం చేసుకోవ‌డం వేరే వాళ్ల‌కు క‌ష్టం కావ‌డం, మార్కెట్ ప‌రిధి త‌క్కువ కావ‌డం వ‌ల్ల ఆ చిత్రాలకు బ‌య‌టి రాష్ట్రాల్లో అంత పాపులారిటీ ఉండేది కాదు.

కానీ ఓటీటీల పుణ్య‌మా అని మ‌ల‌యాళ సినిమాలు అంద‌రికీ బాగా ప‌రిచ‌యం అయ్యాయి. వాటి స‌త్తా తెలిసింది. గ‌త కొన్నేళ్ల‌లో మ‌ల‌యాళ చిత్రాల‌కు తెలుగు వాళ్లే కాక అంద‌రూ బాగా అల‌వాటు ప‌డిపోయారు. దీంతో ఓటీటీలు వాటికి మంచి రేటు ఇచ్చి హ‌క్కులు తీసుకుంటున్నాయి. క‌రోనా కాలంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఓటీటీల్లో డైరెక్ట్‌గా రిలీజైన సినిమాలు మ‌లయాళంవే కావ‌డం విశేషం.

అగ్ర క‌థానాయ‌కుడు మోహ‌న్ లాల్ త‌ర‌చుగా త‌న చిత్రాల‌ను ఓటీటీ బాట ప‌ట్టిస్తున్నారు. దృశ్యం-2, బ్రో డాడీ లాంటి చిత్రాలు నేరుగా ఓటీటీల్లో రిలీజై ఎంత‌గా అల‌రించాయో తెలిసిందే. ఈ కోవ‌లో ఇప్పుడు ఆయ‌న న‌టించిన‌ ట్వ‌ల్త్ మ్యాన్ సినిమాను కూడా ఓటీటీలోనే విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. దృశ్యం, దృశ్యం-2 చిత్రాల ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ రూపొందించిన థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇది షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయింది.

బ్రో డాడీని రిలీజ్ చేసిన హాట్ స్టార్ సంస్థే దీన్ని కూడా విడుద‌ల చేయ‌బోతోంద‌ట‌. ఐతే మోహ‌న్ లాల్ చేసే క్లాస్ సినిమాలు మాత్ర‌మే ఓటీటీ బాట ప‌డుతున్నాయి. మాస్, భారీ చిత్రాలు మాత్రం థియేట‌ర్ల‌లోనే రిలీజ‌వుతున్నాయి. ఈ కోవ‌లోనే మ‌ర‌క్కార్, ఆరట్టు సినిమాలు రిలీజై మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఇక క్లాస్ సినిమాలను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఏ స్థాయిలో వ‌సూళ్లు వ‌స్తాయో ఆ రేటే ఓటీటీల నుంచి వ‌స్తుండ‌టంతో లాల్ వాటిని అటు వైపు మ‌ళ్లించేస్తున్నారు.