బాల‌య్య టైటిల్ అదే అన్న‌మాట‌

నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి మాస్‌కు పూన‌కాలు తెప్పించే పాత్ర‌నే చేస్తున్న‌ట్లున్నాడు. ఇటీవ‌లే అఖండ‌గా ప్ర‌భంజ‌నం సృష్టించిన ఆయ‌న‌.. క్రాక్ మూవీతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే అంచ‌నాలు పెరిగిపోయాయి. పైగా బాల‌య్య కెరీర్లోనే మాసీయెస్ట్ క్యారెక్ట‌ర్‌లో చూడ‌బోతున్న‌ట్లు చెబుతుండ‌టంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది.

మొన్న షూటింగ్ మొద‌లైన తొలి రోజు లీకైన ఆన్ లొకేష‌న్ పిక్ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ఇలా ఫొటో లీక‌య్యేస‌రికి ఆల‌స్యం చేయ‌కుండా డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది చిత్ర బృందం. లీక్డ్ ఫొటోను వైర‌ల్ చేయ‌డమెందుక ఒరిజిన‌లే తీస్కోండి అన్న‌ట్లు షూటింగ్ మొద‌లైన రెండు రోజుల‌కే అఫీషియ‌ల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసింది.

అభిమానుల‌కు, మాస్‌కు పూన‌కాలు తెప్పించేలాగే ఉంది ఎన్బీకే 107 ఫ‌స్ట్ లుక్. ఆ గ‌డ్డం, న‌ల్ల‌చొక్కా- లుంగీ అన్నీ కూడా భ‌లేగా కుదిరాయి బాల‌య్య‌కు. ఇక పోస్ట‌ర్లో అంద‌రినీ ఆక‌ర్షించిన మ‌రో విష‌యం.. బాల‌య్య ప‌క్క‌నున్న డిఫెండ‌ర్ కారు. దాని కింద నంబ‌ర్ ప్లేట్ మీద ఏపీ 39 వీఆర్ 6666.. ఇదీ ఆ కారు నంబ‌రు. ఇందులో వీఆర్ అన్న అక్ష‌రాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఈ చిత్రానికి వీర సింహారెడ్డి అనే మాస్ టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పేరును షార్ట్ చేసి వీఆర్ అని కారు మీద వేసిన‌ట్లు క‌నిపిస్తోంది. కాబ‌ట్టి ఈ టైటిలే సినిమాకు ఫిక్స్ చేయ‌డం లాంఛ‌న‌మే కావ‌చ్చు. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్ పాత్ర చేయ‌నున్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. హీరోయిన్ల విష‌యంలో ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న ఏమీ రాలేదు. అగ్ర నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.