మహేష్ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్

కథ, కథనం, డైలాగ్స్, టేకింగ్.. త్రివిక్రమ్ సినిమాల్లో ఇవన్నీ ఒకెత్తయితే.. క్యారెక్టరైజేషన్స్ మరొకెత్తు. హీరోతో పాటు సినిమాలో ప్రతి పాత్రనీ ప్రత్యేకంగా తీర్చిదిద్దడం త్రివిక్రమ్ స్టైల్. ముఖ్యంగా హీరోకి దీటుగా ఒక పాత్రను సృష్టిస్తాడు. అది చాలావరకు లేడీ క్యారెక్టరే కావడం విశేషం.     

అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో మూవీలో టబు పాత్రలే అందుకు  ఉదాహరణ. తన నెక్స్ట్ సినిమాకి కూడా అలాంటి ఓ క్యారెక్టర్‌‌ని క్రియేట్ చేశాడట త్రివిక్రమ్. దానికి తగిన నటి కోసం మొదలుపెట్టిన అతని వేట.. ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. తనెవరో కాదు.. శోభన.       

త్రివిక్రమ్ సినిమా మహేష్‌బాబుతో అనే సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్. హీరో హీరోయిన్లిద్దరి తర్వాత ఆ రేంజ్‌లో ఉండే ఓ ఇంపార్టెంట్ రోల్‌ కోసం శోభనను సంప్రదించాడట మాటల మాంత్రికుడు. ఆమె కూడా ఓకే చెప్పిందని టాక్.  ఒకప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది శోభన. స్టార్‌‌ హీరోలందరితోనూ నటించింది.        

ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి డ్యాన్స్‌పైనే దృష్టి పెట్టింది. ఎప్పడైనా ఓ స్పెషల్ క్యారెక్టర్ దొరికితే చేస్తోంది. రీసెంట్‌గా దుల్కర్ హీరోగా తెరకెక్కిన ‘పరిణయం’లో నటించింది. అయితే తెలుగులో నటించి మాత్రం చాలా కాలమే అయ్యింది. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌‌’లో చెల్లెలి పాత్ర విషయంలో తన పేరు వినిపించింది కానీ ఆ చాన్స్ నయన్‌కి దక్కింది. మరి ఈ వార్తయినా నిజమైతే పదహారేళ్ల తర్వాత శోభన స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది.