పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ ఇంకో వారం లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల కిందటే షూటింగ్ పూర్తి చేసి, హఠాత్తుగా రిలీజ్ డేట్ ప్రకటించి.. చకచకా సెన్సార్ కూడా చేయించేసి.. హడావుడిగా సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఈ నెల 21న ఈ ఈవెంట్ జరగబోతోంది. ఐతే ముందు ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తారని ప్రచారం జరిగింది.
కానీ తర్వాత ఈవెంట్‌ను సాధ్యమైనంత సింపుల్‌గానే చేయాలనుకున్నారని.. ఎవరూ చీఫ్ గెస్ట్‌గా రారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కథ మారినట్లు సమాచారం. ఈ వేడుకకు ఒక విశిష్ఠ అతిథి రాబోతున్నారు. ఆయనే.. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఆయన ‘భీమ్లా నాయక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి అనే విషయం ఖరారైరంది.
పీఆర్వోలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.కేటీఆర్ ఇంతకుముందు ‘వినయ విధేయ రామ’ సినిమాకు చిరంజీవి, రామ్ చరణ్‌లతో వేదికను పంచుకున్నారు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కేటీఆర్.. చిరు, చరణ్‌లతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఆసక్తికర ప్రసంగం చేశారు. అప్పుడు చరణ్‌ను పవన్‌తో పోలుస్తూ మాట్లాడ్డం విశేషం. కట్ చేేస్తే ఇప్పుడు పవర్ స్టార్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ ఈవెంట్లో పాల్గొనబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.
పవన్, కేటీఆర్ ఒకే వేదికపై ఉంటే కచ్చితంగా ఈ ఈవెంట్‌కు పొలిటికల్ కలర్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరం. ముఖ్యంగా కేటీఆర్.. పవన్ గురించి చేసే వ్యాఖ్యలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఈవెంట్లో రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ చంద్ర సహా ప్రధాన కాస్ట్ అండ్ క్రూ అంతా పాల్గొనబోతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న థియేటర్లలోకి దిగుతుంది.