సీఎంతో మీటింగ్.. మోహన్ బాబుదీ అదే మాట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కొన్ని రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రతినిధుల బృందం సమావేశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలిసిందే. ఈ సమావేశానికి చిరుతో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ తదితరులు వెళ్లారు. ఐతే టాలీవుడ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్లుల్లో ఒకరైన మోహన్ బాబు ఈ మీటింగ్‌కు వెళ్లలేదు. ఆయనకు పిలుపు లేదా.. లేక ఆయనే వెళ్లలేదా అనే విషయంలో మొన్నటిదాకా ఎవరికీ స్పష్టత లేదు.

కానీ ఇటీవల సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా వెళ్లి కలిసిన మంచు విష్ణు.. సీఎంవో నుంచి తన తండ్రికి కూడా ఆహ్వానం పంపారని.. కానీ ఆ ఇన్విటేషన్ అందకుండా చేశారని.. వాళ్లెవరో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. వాళ్లెవరో చెప్పమంటే మాత్రం అది ఇండస్ట్రీకి సంబంధించిన అంతర్గత విషయమని.. ఆ వివరాలు బయటపెట్టబోనని అన్నాడు.కాగా తన కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు.. ఇదే విషయమై మాట్లాడారు.

‘‘ఇటీవల సినిమా టికెట్ల ధరల విషయమై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని రెండు నెలల కిందట బహిరంగ లేఖ రాశాను. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉన్నారన్నారు. బిజీగా ఉన్నా కూడా వీలు చేసుకుని చర్చించడానికి రావాలి. కానీ ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే వాళ్లకు ఇగో. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో చర్చించడానికి వెళ్లారు. సీఎంవో నుంచి నాకు కూడా ఆహ్వానం ఉంది.

నన్ను కూడా చర్చలకు పిలవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ విషయాన్ని వాళ్లు నాకు చెప్పలేదు. నన్ను రమ్మనీ పిలవలేదు. వాళ్లు పిలిచినా పిలవకపోయినా నాకంటూ ఒక చరిత్ర, గౌరవం, విలువ ఉన్నాయి. నా పని నేను చేసుకుంటున్నాను. ఎదుటి వాళ్లకు చేతనైన సాయం చేస్తున్నాను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే వాళ్ల కర్మ. ఎదుటివారి మాటలను నేను పట్టించుకోను’’ అని మోహన్ బాబు అన్నారు. చిత్ర పరిశ్రమ అంతా ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని కూడా మోహన్ బాబు వ్యాఖ్యానించారు.