ఆ దర్శకుడితో మరోసారి రానా

టాలీవుడ్ టాప్ హీరో రానా గతంలో దర్శకుడు తేజతో కలిసి ఓ సినిమా చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద హిట్ అయింది. సోలో హీరోగా రానా కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అయింది. ఈ సినిమా తరువాత రానాతో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు తేజ. ఆ సినిమాకి ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. 

మధ్యలో గోపీచంద్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు తేజ. కానీ ఆయన మారుతి ప్రాజెక్ట్ తో బిజీ అయ్యారు. ఆ తరువాత దర్శకుడు శ్రీవాస్ కి డేట్స్ ఇచ్చారు. దీంతో గోపీచంద్ తో సినిమా కుదరలేదు. దీంతో సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు తేజ. ఈ సినిమా తరువాత తేజ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. 

అభిరామ్ తో సినిమా అయిన వెంటనే రానా సినిమా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఓ మీడియా పోర్టల్ తో వెల్లడించారు. రానా సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని.. దానికి సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.

రానాకి అనారోగ్య సమస్యలు రావడం.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని అన్నారు. 
ఈ ఏడాదిలోనే వీరి కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నటించిన ‘1945’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ‘భీమ్లానాయక్’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.