కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించినప్పుడే.. దేశ ప్రగతిని సాధించగలమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో చిచ్చు పెడతానని.. ప్రధాని మోడీని సాగనంపుతానని అన్నారు. రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు.. ప్రజల ఫ్రంట్‌ను ఊహించండని అన్నారు. “నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా. దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజల కోసం పని చేస్తూ పోతే పదవులు అవే వస్తాయి. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి సినిమా నటులు సీఎంలు కాలేదా?“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుందని కేసీఆర్ అన్నారు. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా? అని ప్రశ్నించారు. సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా? అన్నారు. ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే నని చెప్పారు. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా.. అని కేసీఆర్ చెప్పారు. గవర్నర్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పిందన్నారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం బీజేపీ హయాంలో పెరిగిందని విమర్శించారు. దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీని వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ రాజకీయాలను ఊహించి చెప్పలేమన్న ఆయన. బీజేపీ అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది కాలం చెబుతుందన్నారు.
తెలంగాణలా దేశం మారాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని చెబుతున్నానన్నారు. దళితుల రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అందుకోసమే రాజ్యాంగం మార్చమంటున్నామన్నారు. దేశమంతా దళిత బంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నామని తెలిపారు. బీసీల కులగణన కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నామన్నారు. రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కరే చెప్పారని తెలిపారు. గుజరాత్లో దళిత బిడ్డలను చంపేస్తున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్లో దళిత బిడ్డల ఊరేగింపులను సహించలేకపోతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దన్న ఆయన 77 శాతం సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలని అన్నారు. అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలని తెలిపారు.
రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలు సమంజసమేనా? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టనన్నారు. అసోం సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తోందా..? అని నిలదీశారు. అసోం సీఎంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నానని అంటున్నారు. టీఆర్ ఎస్‌కు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.