సునీల్‌ను ఇరికించేసిన మోహన్ బాబు

సీనియర్ నటుడు మోహన్ బాబు ఏదైనా ఈవెంట్‌కు వచ్చినా.. స్టేజ్ ఎక్కినా.. ఎక్కడ మైక్ అందుకున్నా.. ఎవరినో ఒకరిని గిల్లకుండా వదలరు. కొంచెం ముక్కు సూటిగా మాట్లాడే ఆయన మనసులో దాచుకోవాల్సిన విషయాలను బయట పెట్టేస్తుంటారు. ఈ క్రమంలో అవతలి వాళ్లు ఇబ్బంది పడతారని తెలిసినా ఆయన వెనక్కి తగ్గరు. ఇలాగే ఇప్పుడు కమెడియన్ సునీల్‌ను ఆయన ఇరికించేశారు. సునీల్.. మోహన్ బాబు కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతను కూడా వచ్చాడు. ఈ సందర్భంగా అతను స్టేజ్ ఎక్కి మాట్లాడుతుండగా.. మధ్యలో మోహన్ బాబు మైక్ అందుకున్నారు. ముందుగా ఆయన సునీల్ మీద ప్రశంసలు కురిపించారు. ‘పుష్ఫ’ చిత్రంలో విలన్ పాత్రలో అతను అదరగొట్టేశాడన్నారు. నటుడన్నాక ఇలా అన్ని రకాల పాత్రలూ చేయాలని చెప్పారు. తాను కూడా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశానన్నారు.అంత వరకు బాగానే ఉంది కానీ.. ఒక విషయం చెప్పకపోతే తన కడుపు ఉబ్బిపోతుందన్నారు.

సునీల్ ఈ  సినిమాలో నటించే విషయమై తనను కలిసినపుడు ‘సన్ ఆఫ్ ఇండియా’లో నటిస్తున్న ఆలీ, పోసాని కృష్ణమురళిల కంటే తాను చాలా బాగా నటిస్తానని.. వాళ్లు తన ముందు పనికి రారని అన్నట్లు మోహన్ బాబు చెప్పారు. ఆలీ గురించి మాట్లాడుతూ.. అతను హీరోగా ఒక్క సినిమానే చేశాడని.. అతను తనకంటే ఎక్కువగా హీరోగాసినిమాలు చేయలేదని, ఎక్కువ హిట్లు కొట్టలేదని సునీల్ తనతో అన్నట్లు మోహన్ బాబు తెలిపారు.

ఇలా అన్నావా లేదా.. ఏమన్నావో చెప్పు అంటూ వేదిక మీదున్న సునీల్‌ను సరదాగానే అడిగారు మోహన్ బాబు. ఐతే సునీల్ మాత్రం తాను ఈ మాటలు అననే లేదని స్పష్టం చేశాడు. తాను అబద్ధమాడితే మైకు పేలిపోయేదని.. తాను నిజంగా అలా అనలేదని సునీల్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మోహన్ బాబు మాత్రం వాళ్లు ఏమీ అనుకోరులే చెప్పు అంటూ సునీల్‌ను మరింత ఇరికించే ప్రయత్నం చేశారు. చివరికి సునీల్ ఈ టాపిక్ వదిలేసి తన ప్రసంగాన్ని కొనసాగించాడు.