చిరు ఇలా అడుక్కోవ‌డం బాగోలేదు: త‌మ్మారెడ్డి

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవి బృందం ఇటీవ‌ల భేటీ అయి.. సినీ రంగ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో చిరంజీవి చేసిన `చేతులు జోడించి` వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విస్మ‌యం, ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా సీనియ‌ర్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి.. తన స్థాయిని మరిచి ఏపీ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదని   అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి తన స్థాయిని మరిచి.. అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని భరద్వాజ అన్నారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.  

“ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత సినిమా ప్రముఖులు అంతా బాగా జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. ఈ భేటీతో ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి విభేదాలు లేవని క్లియర్ చేసినందుకు చిరంజీవి‌గారికి ధన్యవాదాలు. అయితే ఆయన ఒక మెగాస్టార్. మేము ఇండస్ట్రీకి పెద్దగా భావిస్తున్నాం.. ఆయన కూడా ఇండస్ట్రీకి బిడ్డ అని చెప్పుకుంటారు. ఇండస్ట్రీకి పెద్దయినా, బిడ్డయినా ఆయనకి కూడా ఒక ఆత్మగౌరవం ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు స్వతహా గా ఆయనే పెద్ద మనిషి. కానీ సీఎం జగన్ తో ఆయన మాట్లాడుతున్న వీడియో చూస్తే ఆయన ఆత్మగౌరవం పక్కనపెట్టి యాచించినట్లు ఉంది“ అని త‌మ్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

ఆయన అలా అడగడం చూసి.. మనం ఇలాంటి స్టేజ్‌లో ఉన్నామా అని చాలా బాధేసిందన్నారు. ఈ భేటీలో సినిమా టికెట్ ధరల గురించే కానీ.. ఇండస్ట్రీలో ఉన్న అనేక సమస్యలు గురించి ప్రస్తావన వచ్చినట్లుగా అనిపించడం లేదని భ‌ర‌ద్వాజ చెప్పారు. “ఐదో షో అన్నారు. సీఎం వైజాగ్‌లో స్థలాలు ఇస్తామని.. ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్ చేయమంటున్నారు. మిగతా సమస్యలపై కూడా సీఎం  సానుకూలంగా స్పందించి ఉంటే.. సంతోషించే వాళ్ళం“ అని భ‌ర‌ద్వాజ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ధరల పెంచుతున్నట్లుగా వారు చెప్పినా.. మహా అయితే ఇప్పుడున్న దానికి 15-20 శాతం మాత్రమే పెంచుతారని అన్నారు. వాటి వల్ల వచ్చే తేడా ఎంతో ఉండదని తెలిపారు. దానికే సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నామని వారు చెప్పడం ఏంటో త‌న‌కు అర్థం కాలేదన్నారు.

“అసలు సినిమాలు రిలీజ్ కాకపోవడానికి కారణం కరోనా. అది కాకుండా కేవలం టికెట్ ధరల వల్లే అని చెప్పడం.. వినడానికి బాధగా అనిపించింది. ఇప్పుడున్న టికెట్ల ధరలతోనే ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు బాగా వసూలు చేశాయి. ఓ 20 నుండి 25 కోట్ల కోసం ఇండస్ట్రీకి దిగ్గజాలైన చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వెళ్లి అడుక్కోవడం నిజంగా బాధ అనిపించిం ది. చిరంజీవి వంటి వ్యక్తి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం శాసించే వాళ్లం కాకపోయినా.. టాక్స్‌లు కడుతున్నవా ళ్లమే. అలాగే మనం కూడా ఓటేసిన వాళ్లమే. మన గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఎదుటివారిని కూడా గౌరవిస్తూ మాట్లాడాలి. అంతేకానీ, అణిగిపోయి అణగారిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఇదంతా చూసి.. నాకు బాధగా అనిపించింది..’’ అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.