తెలుగు సినీ పరిశ్రమ దాదాపు పది నెలల నుంచి ఎదుర్కొంటున్న ఒక తీవ్ర సమస్య ఎట్టకేలకు పరిష్కారం దిశగా వెళ్తున్నట్లే కనిపిస్తోంది. అసలే కొవిడ్ వల్ల కుదేలైన ఫిలిం ఇండస్ట్రీకి.. ముఖ్యంగా థియేటర్ల వ్యవస్థకు ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు గొడ్డలి పెట్టులా తయారవడం తెలిసిందే. ఓవైపు నిత్యావసరాలు సహా అన్ని ధరలూ అసాధారణంగా పెంచేస్తూ ఎవ్వరూ కోరుకోని టికెట్ల రేట్లను అసమంజసంగా తగ్గించడం పట్ల ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని విజ్ఞప్తులు చేసినా జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు.
సమస్యేంటో అందరికీ తెలుసు. పరిష్కారానికి ఏం చేయాలో తెలుసు. అయినా ఈ విషయాన్ని నెలలకు నెలలు సాగదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లేని సమస్యను సృష్టించి.. దానికి పరిష్కారమే లేనట్లు ఇంత కాలం దాన్ని నాన్చడం విడ్డూరం కాక మరేంటి? ఐతే జగన్ సర్కారు ఇలా చేయడం వెనుక కారణాలేంటో అందరికీ తెలుసు.ముందుగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ సమస్యకు తెర తీశారు.
ఆ తర్వాత ఇండస్ట్రీ జనాలు జగన్‌ను సీఎంగా గుర్తించి, గౌరవించకపోవడమే ఈ సమస్య తీవ్రం కావడానికి పరోక్ష కారణమనే అభిప్రాయాలు బలపడ్డాయి. చిరంజీవి, నాగార్జున సహా చాలామంది పలు దఫాలు ఏపీ మంత్రులతో సమావేశాలు నిర్వహించినా.. చిరు వ్యక్తిగతంగా వెళ్లి జగన్‌ను కలిసినా ఆశించన ప్రయోజనం నెరవేరలేదు. ఐతే ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు వీలైనంత ఎక్కువమంది వెళ్లి జగన్‌ను కలిసి సమస్య పరిష్కరించాలంటూ అడిగితే తప్ప ప్రతిష్ఠంభన వీడకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు చిరుతో పాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ లాంటి ప్రముఖులు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లారు.
అందరూ సమావేశంలో జగన్‌ను మెప్పించడానికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. బయటొచ్చి మీడియాతో, ఆపై ట్విట్టర్లో జగన్ మీద ప్రశంసలు కురిపించడం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడంజరిగింది. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ఇంకా కొందరు ప్రముఖ కథానాయకులు సీఎంను కలవలేదు. కానీ వారికి రాజకీయంగా ఉన్న అడ్డంకుల గురించి తెలిసిందే. వాళ్లు వస్తారని జగన్ కూడా ఆశించి ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నంతలో జగన్ ఇగోను చల్లబరచడానికి ఇండస్ట్రీవైపు చేయాల్సిందంతా చేశారు.మరి ఇప్పటికైనా ఆయన పట్టువీడి టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates