మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ముంబయిలో అడుగు పెట్టి టీవీ రంగంలో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి అరంగేట్రం చేసి ఇక్కడా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్వల్ప కాలంలోనే స్టార్‌గాఎదిగాడు. ఎం.ఎస్.ధోని సినిమాతో కోట్లాదిమందిని అభిమానులుగా మార్చుకున్నాడు.
కొన్ని నెలల కిందటే పెద్ద హిట్టు కొట్టాడు. ఇలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణం సాగించి, ఇంత మంచి స్థాయిలో ఉన్న సుశాంత్ రాజ్‌పుత్.. చివరికి ఇలా ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమాల్లో చాలా వరకు అతను స్ఫూర్తిదాయక పాత్రలే చేశాడు.
చివరగా అతడి నుంచి వచ్చిన చిచ్చోరే సినిమానే తీసుకుంటే.. అందులో సుశాంత్ ఆత్మహత్యకు వ్యతిరేకంగా ఒక మంచి డైలాగ్ చెప్పాడు. సినిమా ఆరంభ సన్నివేశంలో తనకు ర్యాంకు రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే పక్కన కూర్చుని ఉంటాడు సుశాంత్. జీవితంలో అన్నిటికంటే విలువైంది ప్రాణమే అంటూ అతను డైలాగ్ చెబుతాడు. ఈ సినిమాలో అతడి పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
వెండితెరపై అంత మంచి పాత్ర చేసి.. అంత మంచి మాట చెప్పిన సుశాంత్ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆ మాటను పాటించకపోవడం.. ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సదరు సన్నివేశం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. చివరగా సుశాంత్ ఈ సీన్ చూసినా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని అంటున్నారు ఫ్యాన్స్.