పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఎంత స్పీడుగా సినిమాలు చేద్దామని చూసినా ఆయనకు పరిస్థితులు కలిసి రాలేదు. కొవిడ్ కారణంగా ప్రతి సినిమా ఆలస్యమవుతూనే ఉంది. అయినప్పటికీ వీలైనంత వేగంగానే ఒక్కో సినిమా లాగించేస్తున్నాడు పవన్. గత ఏడాది వేసవికి ‘వకీల్ సాబ్’ను దించిన పవన్.. ఈ ఏడాది సమ్మర్లో ‘భీమ్లా నాయక్’తో పలకరించబోతున్నాడు.
ఈ చిత్రాన్ని ముందు సంక్రాంతికి షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఐతే ఆ చిత్రం ఈ నెలలో కూడా విడుదలయ్యే పరిస్థితులేమీ కనిపించడం లేదు. కొవిడ్ ప్రభావం కొనసాగుతుండటం, ఏపీలో థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇలాంటి భారీ చిత్రాన్ని ఈ నెలలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంతో చిత్ర బృందం ఉంది.
ఈ ఉద్దేశంతోనే సినిమాను విడుదలకు సిద్ధం చేసే విషయంలో హడావుడి పడట్లేదు.‘భీమ్లా నాయక్’ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకో వారం రోజుల దాకా చిత్రీకరణ మిగిలే ఉందట. అందులో పవన్ కళ్యాణ్ మీద రెండు రోజులు షూటింగ్ జరపాల్సి ఉందట. ఇవన్నీ చిన్న చిన్న సన్నివేశాలే అని.. మిగతా ప్యాచ్ వర్క్ అంతా కూడా పూర్తి కావడానికి వారం పడుతుందని.. ఆ తర్వాత నెమ్మదిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవాలని ‘భీమ్లా నాయక్’ టీం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గడ్డంతో కనిపిస్తున్న పవన్.. మళ్లీ భీమ్లా నాయక్ లుక్‌లోకి మారి.. ఈ నెల 10, 11 తేదీల్లో షూటింగ్‌కు హాజరు కాబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఫోకస్ ‘హరిహర వీరమల్లు’ మీదికి మళ్లనుంది. విరామం లేకుండా పని చేసి ఆ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే ఏప్రిల్ 1నే ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకులను పలకరించే అవకాశముంది. ‘హరిహర వీరమల్లు’ దసరా టైంకి రిలీజ్ కావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates