ఈ మధ్య కొంచెం దూరం పెరిగిందేమో కానీ.. ఒకప్పుడు మన మోహన్ బాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆప్త మిత్రులు. ఒకరికొకరు ఎంతో సాయం చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్.. మోహన్ బాబుకు చేసిన సాయం ఆయన ఎప్పటికీ మరువలేనిది.
90వ దశకంలో వరుస ఫ్లాపులతో మోహన్ బాబు కొంత ఇబ్బంది పడుతున్న సమయంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘నాట్టామై’ను రీమేక్ చేయమని సలహా ఇవ్వడమే కాదు.. ఆ సమయంలో మోహన్ బాబుకు ఆర్థికంగా సాయం అందించాడు రజనీ. అది చాలదన్నట్లు ఈ రీమేక్‌లో పారితోషకం కూడా తీసుకోకుండా ఓ ముఖ్య పాత్ర కూడా చేశాడు. దీనికి సంబంధించిన అనుభవాలపై మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.
“పెదరాయుడు సినిమాకు ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో తెలియదు. అతను రాజమండ్రికి వచ్చాడని తెలిసి కలవడానికి వెళ్లాను. ఇద్దరం కలిసి కార్లో హోటల్‌కు వెళ్లాం. ‘ఇది తీసుకోరా’ అంటూ ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అందులో చూస్తే 45 లక్షల రూపాయలున్నాయి. ఎందుకురా అని అడిగితే.. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు. పెదరాయుడు సినిమా మంచి విజయం సాధిస్తుంది. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు. అప్పటికే ‘నాట్టామై’ సినిమా బాగుందని, రీమేక్ హక్కులు తీసుకోమని నాకు రజనీనే సలహా ఇచ్చాడు.
అప్పటికే ఆ చిత్ర నిర్మాత ఆర్బీ చౌదరితో రజనీ మాట్లాడి ఉండటంతో ఆయన హక్కులు అడగ్గానే మరో మాట లేకుండా ఇచ్చేశారు. సినిమాలో అన్ని పాత్రలకూ నటీనటులు కుదిరాక పాపా రాయుడు పాత్రకు ఎవరిని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో రజనీనే తానా పాత్ర చేస్తానని ముందుకొచ్చాడు. ఇది అతిథి పాత్ర కదా, నువ్వెలా చేస్తావు అన్నా కూడా తాను చేయాలనుకునే ఈ సినిమా రీమేక్ గురించి తనకు చెప్పినట్లు వెల్లడించాడు. ఈ పాత్రకు రజనీ పారితోషకం కూడా తీసుకోలేదు’’ అని మోహన్ బాబు వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates