బన్నీ యాడ్.. ఇంకో వివాదం

తెలుగులో తమ బ్రాండ్‌ను బాగా వాడుకుని యాడ్స్ చేస్తున్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. ఈ విషయంలో మహేష్ బాబును కొట్టేవారే లేరు. ఈ మధ్య బన్నీ సైతం స్పీడు పెంచాడు. వరుసగా బ్రాండ్స్ ఒప్పుకుంటున్నాడు. వాటి కోసం యాడ్స్ చేస్తున్నాడు. ఐతే అతను చేస్తున్న యాడ్స్ ఏదో ఒక రకంగా వివాదంలో చిక్కుకుంటుండం గమనార్హం. ఇప్పటికే ర్యాపిడో కోసం అతను చేసిన యాడ్ మీద జరిగిన రచ్చ తెలిసిందే.

ఆర్టీసీ బస్సుల్ని కించపరిచేలా ఉందంటూ ఆ యాడ్ మీద టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతర పెట్టడం.. దీంతో ఆ ప్రకటనను మార్చడం తెలిసిందే. ఇప్పుడు బన్నీ నుంచి వచ్చిన కొత్త యాడ్ మీదా వివాదం రాజుకుంటోంది. జొమాటో కోసం బన్నీ చేసిన యాడ్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఆ యాడ్ దక్షిణాది సినిమాలను కించపరిచేలా ఉందంటూ దాని మీద నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌లో బన్నీ హీరోగా కనిపిస్తే.. సుబ్బరాజు విలన్ పాత్ర చేశాడు.

బన్నీ కొడితే.. సుబ్బరాజు గాల్లో ఎగురుతున్నట్లుగా చూపించారిందులో. ఐతే ఇలా ఎంతసేపు గాల్లో ఉండాలి అని సుబ్బరాజు అంటే.. సౌత్ సినిమాల్లో అంతే అంటాడు బన్నీ. తెలుగు, తమిళ చిత్రాల్లో ఫైట్లలో కొంచెం అతి ఉంటుంది. హీరో కొడితే గాల్లోకి ఇంతెత్తు ఎగిరి పడుతుంటారు రౌడీలు. దీని గురించి బాలీవుడ్ వాళ్లు కామెడీలు కూడా చేస్తుంటారు. ఐతే మాస్ ప్రేక్షకులను అలరించాలంటే ఆ మాత్రం అతి అవసరమే అన్నది మన ఫిలిం మేకర్స్ అభిప్రాయం.

ఇలాంటి మాస్ అంశాలే ఇప్పుడు నార్త్ ఇండియన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఐతే ఆ సంగతలా ఉంచితే.. జొమాటో యాడ్‌లో బన్నీ చెప్పిన ఆ డైలాగ్ కొందరికి రుచించడం లేదు. సౌత్ సినిమాలతో ఎదిగి.. సౌత్ సినిమాలను కించపరిచేలా బన్నీ డైలాగ్ చెప్పాడని.. ఇది సమంజసం కాదని అంటున్నారు. అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. ఐతే ప్రముఖులెవరూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి జొమాటో వాళ్లు ఈ యాడ్ విషయంలో తగ్గేదే లే అంటారేమో. ఇలా వివాదం రాజుకుంటే ఇంకా యాడ్ పాపులర్ అవుతుందని అనుకుంటారేమో. ఈ ప్రకటనను స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసినట్లు సమాచారం.