‘క్రాక్’ సస్పెన్స్ కంటిన్యూ అవుతోందిగా..

Krack Movie

మాస్ మహరాజా మళ్లీ తనదైన స్టైల్లో చేస్తున్న సినిమా ‘క్రాక్’. దీనికి ముందు కొంచెం డిఫరెంటుగా ఏదైనా చేద్దామని రవితేజ ట్రై చేసిన సినిమాలు దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో మళ్లీ తనకు అలవాటైన మాస్ స్టయిల్లోనే ‘క్రాక్’ చేస్తున్నాడు. ఇంతకుముందు రవితేజకు ‘డాన్ శీను’; ‘బలుపు’ లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం ఓ తమిళ హిట్‌కు రీమేక్ అన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.

కానీ ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ పోస్టర్ మీదే వేశారు. దర్శకుడు కూడా రీమేక్ ప్రచారాన్ని ఖండించాడు. కానీ ఆ మధ్య రిలీజైన ‘క్రాక్’ టీజర్ చూస్తే మాత్రం జనాలకు మళ్లీ డౌట్లు కొట్టాయి. తమిళ హిట్ ‘సేతుపతి’ని గుర్తు చేసే కొన్ని సీన్లు ఈ టీజర్లో కనిపించాయి.

దీంతో ఇది ‘సేతుపతి’ రీమేకే అని ఫిక్సయిపోయారంతే. ఐతే ‘సేతుపతి’ని ఇంతకుముందే ‘జైదేవ్’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. పైగా క్లాసిక్ లాగా కనిపించిన ఒరిజినల్‌ను ఎంతగా కిల్ చేయాలో అంతా చేశారు. ఐతే గోపీచంద్ కొంచెం తెలివిగా.. మూల కథ తీసుకుని దానికి తనదైన ట్రీట్మెంట్ ఇచ్చి రీమేక్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘క్రాక్’ రీమేక్ కాదనే నొక్కి వక్కాణించాడు.

ఇది మన దగ్గరే జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అన్నాడు. దీంతో మళ్లీ ఇది రీమేకా కాదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. బహుశా ‘దబంగ్’ను హరీష్ శంకర్ తనదైన శైలిలో ‘గబ్బర్ సింగ్’గా మలిచినట్లు గోపీచంద్ కూడా ‘సేతుపతి’కి తనదైన టచ్ ఇచ్చి ఉంటాడని.. అందుకే ఇది రీమేక్ అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదని.. పైగా ఇప్పటికే ఒకసారి రీమేక్ అయిన సినిమాను మళ్లీ రీమేక్ అంటే వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో విషయం దాచి పెడుతున్నారని అనిపిస్తోంది.