త్వరలోనే ఒక భారీ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమానే.. మహాన్. తమిళ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకడైన విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. ఇందులో అతడి కొడుకు ధ్రువ్ కూడా కీలక పాత్ర చేయడం విశేషం. ఒక్క సినిమా అనుభవంతోనే తండ్రితో జట్టు కట్టేశాడతను.
పిజ్జా, జిగర్ తండ లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. పేట, జగమే తంత్రం లాంటి చిత్రాలతో నిరాశ పరిచిన కార్తీక్.. ఈసారి మంచి సినిమానే తీశాడనిపిస్తోంది ‘మహాన్’ ప్రోమోలు చూస్తుంటే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు లాంచ్ చేసిన ట్రైలర్ సైతం మెప్పిస్తోంది.
టీజర్‌తో పోలిస్తే కథను కొంచెం విపులంగా చెప్పారు ట్రైలర్లో. మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాడిన తాతకు మనవడిగా పుట్టి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. చాలీ చాలని జీతంతో ఇబ్బందులు పడుతూ.. భార్య చేత సూటి పోటి మాటలు అనిపించుకుంటూ.. చివరికి మనం కోరుకున్న జీవితం ఇది కాదనుకుని.. మద్యం వ్యాపారంలోకి దిగే వ్యక్తి కథ ఇది.
మద్యం వ్యాపారంలో కోట్లకు పడగలెత్తి అరాచక శక్తిగా మారాక.. అన్యాయాన్ని సహించని అతడి కొడుకుతోనే తండ్రి తలపడాల్సిన పరిస్థితి రావడం.. అనూహ్య పరిణామాల మధ్య తన తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ, తండ్రి కోరికను నెరవేరుస్తూ మంచి వాడిగా మారి మద్యానికి వ్యతిరేకంగా పోరాడతాడు హీరో. ముందు మంచి వాడిగా ఉండి చెడ్డవాడు కావడానికి దారి తీసిన పరిణామాలు.. ఆపై మళ్లీ మంచివాడు కావడానికి దోహద పడే అంశాల నేపథ్యంలో సినిమా నడిచేలా ఉంది. విక్రమ్ తనదైన శైలిలో మహాన్ పాత్రను పండించినట్లున్నాడు. ధ్రువ్ క్యారెక్టర్, అతడి లుక్ కూడా చాలా బాగున్నాయి. తండ్రీ కొడుకుల ఫేసాఫ్ సీన్లే సినిమాకు హైలైట్ లాగా కనిపిస్తున్నాయి. ఈ నెల 10న ‘మహాన్’ తమిళం, తెలుగు సహా ఐదారు భాషల్లో ఒకేసారి ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.