Mahaan టీజర్ టాక్: కాన్సెప్ట్ అదిరింది

ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగి ఇక్కడ అన్ని భాషల వాళ్ల దృష్టినీ ఆకర్షించాడు విక్రమ్. అపరిచితుడు, శివపుత్రుడు, సామి లాంటి బ్లాక్‌బస్టర్లతో అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ఊపును కొనసాగించి ఉంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లో ఒకడై ఉండేవాడు. కానీ సరైన సినిమాలు ఎంచుకోక, ప్రయోగాల పేరుతో పనికి రాని చిత్రాలన్నీ చేసి మార్కెట్, క్రేజ్ మొత్తం దెబ్బ తీసుకున్నాడీ విలక్షణ నటుడు.

పైన చెప్పుకున్న సినిమాల తర్వాత ఇప్పటిదాకా విక్రమ్‌కు నిఖార్సయిన హిట్టే లేదు. ఎన్నో జానర్లలో, ఎంతోమంది ప్రముఖ దర్శకులతో రకరకాల సినిమాలు చేసి విఫలమైన విక్రమ్.. ఇప్పుడు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ‘మహాన్’ అనే వెరైటీ సినిమా చేశాడు. ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ కూడా ఓ కీలక పాత్ర చేయడం విశేషం.

అమేజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 10న ‘మహాన్’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దీని టీజర్ లాంచ్ చేశారు.దేశంలో మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక మహానుభావుడి మనవడు.. చిన్నతనంలో తన తాత స్ఫూర్తితో తాను కూడా ఆయనలా జీవిస్తానని శపథం చేస్తాడు. ఆయనలా తానూ మహాత్ముడిని అవుతానని మాటిస్తాడు. చివరికి చూస్తే అతను మద్యం వ్యాపారంలో అడుగు పెడతాడు. తన ప్రాంతంలో ప్రతి చోటా తాను సరఫరా చేసే మద్యమే అందరూ తాగాలని.. ఎవరు బార్ లైసెన్స్ తీసుకున్నా వాళ్లు తన వాళ్లే అయ్యుండాలని అంటాడు.

ఇదీ విక్రమ్ ‘మహాన్’లో చేసిన పాత్ర. టీజర్ వరకు చూస్తే ఈ కాన్సెప్ట్ భలేగా అనిపిస్తోంది. ఐతే కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంటి భిన్నమైన ఐడియాలతో కెరీర్ ఆరంభంలో వారెవా అనిపించాడు. కానీ తర్వాత అతడి మెరుపులన్నీ టీజర్ల వరకే పరిమితం అవుతున్నాయి. సినిమాలు తేలిపోతున్నాయి. పేట, జగమే తంత్రం సినిమాల సంగతి తెలిసిందే. మరి ‘మహాన్’లో అయినా అతడి మెరుపులు సినిమాలోనూ కొనసాగుతాయేమో చూడాలి. టీజర్ అంతా విక్రమ్ హవానే కనిపించింది. ధ్రువ్ చివర్లో కొన్ని క్షణాలే కనిపించాడు. అతడి పాత్రను సస్పెన్స్‌లా దాచిపెట్టినట్లున్నారు. ట్రైలర్లో అతడి మెరుపులు చూడొచ్చేమో.