ప్ర‌భాస్.. సాహో అనుభ‌వం గుర్తుందా?

ప్ర‌భాస్ సినిమాలంటే భారీ త‌నానికి కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాయి ఇప్పుడు. బాహుబ‌లితో అత‌డి క్రేజ్, మార్కెట్ అన్నీ అమాంతం పెరిగిపోవ‌డంతో ఆ త‌ర్వాత అత‌డి ప్ర‌తి సినిమాకూ బ‌డ్జెట్లు వంద‌ల కోట్ల‌ల్లో ఉంటున్నాయి. క‌థ‌కు ఎంత అవ‌స‌రం అన్న‌దానికంటే డాబు చూపించ‌డానికే నిర్మాత‌లు అయిన‌కాడికి ఖ‌ర్చు పెట్టాల‌ని చూస్తున్నారా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

ప్ర‌భాస్ సినిమా అంటే ప్రేక్ష‌కులు భారీత‌నం ఆశిస్తున్న మాట వాస్త‌వ‌మే కానీ.. యాక్ష‌న్ పేరు చెప్పి ప‌దుల కోట్లు పోసేస్తుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. సాహో సినిమా విష‌యంలో అన‌వ‌స‌ర ఖ‌ర్చు హ‌ద్దులు దాటిపోవ‌డం తెలిసిందే. ముందు 60-70 కోట్లలో తీయాల‌నుకున్న సినిమాను కాస్తా బ‌డ్జెట్ పెంచుకుంటూ పోయి రూ.300 కోట్ల‌లో తీశారు. ముఖ్యంగా దుబాయ్‌లో తీసిన ఓ యాక్ష‌న్ ఘ‌ట్టానికే 700-80 కోట్ల దాకా ఖ‌ర్చయిన‌ట్లు ఘ‌నంగా చెప్పుకున్నారు.

తీరా తెర మీద చూస్తే ఆ స‌న్నివేశం అనుకున్నంత కిక్ ఇవ్వ‌లేదు. కేవ‌లం భారీగా ఖ‌ర్చు పెట్టినంత మాత్రాన స‌న్నివేశాలు, సినిమాలు జ‌నాల‌కు న‌చ్చేస్తాయ‌న్న గ్యారెంటీ లేదు. ఐతే ప్ర‌భాస్ త‌ర్వాతి సినిమాల విష‌యంలోనూ ఈ ఆడంబ‌రం కొన‌సాగుతోంది. రాధేశ్యామ్ లాంటి మామూలు ల‌వ్ స్టోరీని కూడా భారీ ఖ‌ర్చు పెట్టే తీశారు. ఇప్పుడు తెర‌కెక్కుతున్న సినిమాల సంగ‌తీ ఇలాగే ఉంది. ప్ర‌భాస్ కొత్త చిత్రాల్లో ఒక‌టైన స‌లార్‌కు సంబంధించి ఇప్పుడో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇందులో కేవ‌లం క్లైమాక్స్ కోస‌మే రూ.75 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని భారీగా తీయ‌డానికే ఈ ఖ‌ర్చు అంటున్నారు. ఐతే సాహో సినిమాకు ఇలాగే నేల‌విడిచి సాము చేస్తే ఏమైందో తెలిసిందే. కాబ‌ట్టి ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కంటెంట్ మీద దృష్టిపెడితే బెట‌ర్. అవ‌స‌ర‌మైన మేర భారీత‌నం ఓకే కానీ.. కేవ‌లం భారీత‌నం వ‌ల్ల ఏ స‌న్నివేశం పండ‌దు, సినిమా ఆడేయ‌ద‌ని ప్ర‌భాస్ సినిమాల మేక‌ర్స్ అర్థం చేసుకుంటే మంచిది.