టాలెంట్ ఉంటే సరిపోతుందా? దాన్ని గుర్తించే పెద్ద మనసు ఉండాలి. వారి ప్రతిభను ప్రపంచం గుర్తించేలా అవకాశం ఇవ్వాలి. సమాజం పెద్దగా గుర్తించని ఆణిముత్యాల్నివెలికి తీసే స్టార్ గా … పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను చెప్పాలి. తాను చేసే సినిమాల్లో కొత్త టాలెంట్లను అందరికి పరిచయం చేసి.. విస్మయానికి గురి చేస్తుంటారు. త్వరలో విడుదల కానున్న భీమ్లానాయక్ మూవీకి సంబంధించిన కీలకమైన పాటను పాడించి కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యను పరిచయం చేసిన పవన్ కల్యాణ్.. ఆయన జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పారు.
చేతిలో డబ్బుల్లేక కట్టుకున్న భార్య అంత్యక్రియల్ని జరిపించలేనంత పేదరికంలో ఉన్న ఒక గ్రామీణ ఆణిముత్యాన్ని అందరికి తెలిసేలా చేయటమే కాదు.. ఆయనలోని టాలెంట్ ఎంత అపురూపమైనదన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. ఇటీవల పద్మశ్రీ పురస్కారం లభించటం తెలిసిందే. అక్కడితో కథ అయిపోలేదు. నిజానికి అక్కడి నుంచే కొత్త కథ మొదలైంది.
మొగిలయ్య టాలెంట్.. ఆయనకు ప్రతిభకు దక్కిన గౌరవ మర్యాదలకు తన వంతు సాయం అందించాలని సీఎం కేసీఆర్ సీన్లోకి వచ్చారు. తాజాగా ఆయన్ను తన అధికార నివాసమైన ప్రగతిభవన్ కు పిలిపించారు. శాలువాతో సత్కరించటంతో పాటు.. ఆయన కలలో కూడా ఊహించని వరాల్ని ప్రకటించారు. హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు.. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు.. ఇతరత్రా అవసరాల కోసం రూ.కోటిని ప్రకటించారు.
మొగిలయ్యతో సమన్వయం చేసుకొని.. ఆయన నివాసానికి అవసరమైన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని.. ఆయన్ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని.. గౌరవ వేతనాన్ని ఇస్తన్నట్లు ప్రకటించారు. నేటికి హైదరాబాద్ పాత బస్తీకి దగ్గరగా ఉండే సింగరేని కాలనీలో నెలకు రూ.1500 అద్దెకు ఒక చిన్న గూడులో ఉండే మొగిలయ్య కష్టాల్ని కేసీఆర్ తన తాజా వరాలతో తీర్చేశారని చెప్పాలి.
ఇదంతా చూసినప్పుడు మొగిలయ్య టాలెంట్ ను గుర్తించి.. అవకాశం ఇచ్చిన పవన్ కల్యాణ్ ను.. ఆయన పేదరికాన్ని.. ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ప్రజల ముంగిటకు తెచ్చిన మీడియా.. స్పందించి ఆయన జీవితం మారిపోయేలా వరాలు ప్రకటించిన కేసీఆర్ ను ఈ ఎపిసోడ్ లో మాత్రం అభినందించకుండా ఉండలేమని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates