పూరి దాన్నే బయటికి తీస్తున్నాడా?

జనగణమన.. పూరి జగన్నాథ్ ఎన్నో ఏళ్ల కింద ప్రకటించిన సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ సినిమా తీయాలని ఆయన అనుకున్నారు. ‘బిజినెస్ మ్యాన్’ తర్వాత ఈ సినిమా చేయడానికి కొంత వరకు చర్చలు జరిగాయి. కానీ తర్వాత ఇద్దరూ వేర్వేరు కమిట్మెంట్లలో పడిపోవడం.. ఆపై పూరి ఫాంలో కోల్పోవడం.. వేరే కారణాలు కూడా తోడై ఈ చిత్రం ఎంతకీ పట్టాలెక్కలేదు.

చివరికి చూస్తే మహేష్‌కు ఈ సినిమా చేసే ఆసక్తి లేదని పూరికి అర్థమైంది. దీంతో వేరే హీరోతో ఈ సినిమా చేయడానికి ఆయన చూస్తున్నారు. ఐతే ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఈ కథను తెరకెక్కించడానికి ఆయన ఫిక్సయినట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. వీరి కలయికలో త్వరలోనే ‘లైగర్’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్లీ కలిసి ఇంకో సినిమాచేయడానికి పూరి, విజయ్ ఫిక్సయినట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

నిజంగా వీళ్లిద్దరూ రెండో సినిమా చేయబోతుడటం పక్కా అయితే.. ఆ కథ ‘జగనణమన’నే అంటున్నారు. ‘లైగర్’ సినిమా విషయంలో ఇటు విజయ్, అటు పూరి పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ ఊపులోనే ‘జనగణమన’ చేయడానికి ఇద్దరూ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పటికి అంతా ఓకే అనుకున్నా.. ‘లైగర్’ ఫలితాన్ని బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది.

ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకుంటే.. వీరి కాంబినేషన్‌కు క్రేజ్ పోతుంది. అప్పుడు కొత్త సినిమా డోలాయమానంలో పడుతుంది. పూరి ఇంతకుముందు నితిన్‌తో ‘హార్ట్ ఎటాక్’ తర్వాత.. మహేష్‌తో ‘బిజినెస్ మ్యాన్’ తర్వాత.. బాలయ్యతో ‘పైసా వసూల్’ తర్వాత ఇంకో సినిమా ఉంటుందని ఊరించడం.. తర్వాత ఆయా చిత్రాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ఆ కాంబినేషన్లు రిపీట్ కాకపోవడం తెలిసిందే. మరి ‘లైగర్’ అయినా సక్సెస్ అయి ఇప్పుడు వార్తల్లో ఉన్న రిపీట్ కాంబినేషన్ నిజమవుతుందేమో.. ‘జనగణమన’ బయటికి వస్తుందేమో చూడాలి.