కొన్ని వారాల నుంచి సినీ ప్రేమికులకు వరుసగా చేదు గుళికలే అందుతున్నాయి. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో సంక్రాంతి సీజన్లో రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్రమే కాదు.. ఫిబ్రవరి తొలి రెండు వారాల్లో రావాల్సిన ఆచార్య, మేజర్ లాంటి క్రేజీ మూవీస్ వాయిదా పడిపోయాయి.
ఈ జాబితాలో మరిన్ని సినిమాలు చేరుతున్నాయి. దీంతో భీమ్లా నాయక్ కూడా వాయిదా పడటం పక్కా అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముదుగా జనవరి 12కు షెడ్యూల్ అయిన ఈ చిత్రం.. ఆ తర్వాత ఫిబ్రవరి 25కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఫిబ్రవరి ప్రథమార్ధంలో రావాల్సిన ఆచార్య, మేజర్ సినిమాలను వాయిదా వేశారంటే.. రెండో అర్ధంలో రావాల్సిన భీమ్లా నాయక్ మాత్రం ఎందుకు వాయిదా పడకుండా ఉంటుందన్నది జనాల ఆలోచన.
కాబట్టి వీటి నిర్మాతల బాటలోనే.. భీమ్లా నాయక్ మేకర్స్ కూడా వాయిదా స్టేట్మెంట్ ఇవ్వడం లాంఛనమే అనుకుంటున్నారు. కానీ భీమ్లా నాయక్ టీం మాత్రం ఫిబ్రవరి రిలీజ్ డేట్‌కు కట్టుబడే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో వాళ్లేమీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించట్లేదు. కొవిడ్ కేసులు వచ్చే పది రోజుల్లో పీక్స్‌ను అందుకుని.. ఆ తర్వాత తగ్గుముఖం పడతాయన్నది నిపుణుల అంచనా. ఈ ప్రకారం ఫిబ్రవరి మధ్యకు వచ్చేసరికి కరోనా ఉద్ధృతి బాగా తగ్గుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న సినిమా విడుదలకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చని.. పుష్ప తర్వాత భారీ చిత్రాలేవీ లేక రెండు నెలల పాటు నిరాశలో ఉన్న ప్రేక్షకులు.. భీమ్లా నాయక్ రిలీజైతే ఎగబడి చూస్తారని.. బాక్సాఫీస్‌కు కూడా మంచి ఊపొస్తుందని చిత్ర బృందం భావిస్తోందట. ఐతే ఒక్క విషయంలో మాత్రం భీమ్లా నాయక్ టీంలో భయం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే అస్సలు పడని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా థియేటర్ల మీద ఆంక్షలు కొనసాగిస్తారేమో.. వేరే రకంగానూ ఇబ్బంది పెడతారేమో అన్నదే ఆందోళన.