మ‌హేష్‌.. కేబీఆర్ పార్క్.. ఒక పాము క‌థ‌


పామును చూసి భ‌య‌ప‌డని వాళ్ల శాతం ఈ ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌గా ఉంటుంది. దాన్ని చూడ‌గానే నిలువెల్లా వ‌ణికిపోయే వాళ్లే ఎక్కువ‌మంది. ఫొటోలు, వీడియోల్లో కూడా పామును చూడ్డానికి భ‌యం వేస్తుంది చాలామందికి. తెర మీద వీర విన్యాసాలు చేసే హీరోలు కూడా ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు కూడా పాములంటే చాలా చాలా భ‌య‌మ‌ట‌.

హైద‌రాబాద్ కేబీఆర్ పార్కులో ఒక పామును చూసి తాను ఎంత‌గా భ‌య‌ప‌డిపోయానో నంద‌మూరి బాల‌కృష్ణ నిర్వ‌హించే అన్ స్టాప‌బుల్ టాక్ షోలో మ‌హేష్ బాబు వివ‌రించాడు. ఈ షో లాస్ట్ ఎపిసోడ్‌కు మ‌హేష్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. అత‌డికి స‌న్నిహితుడైన ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 1న ఈ ఎపిసోడ్‌కు ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ పాము ఎపిసోడే హైలైట్‌గా నిలిచింది.

కేబీఆర్ పార్కులో ఒక‌సారి జాగింగ్ కోసం వెళ్లిన తాను.. మొత్తం పార్కును ఒక రౌండేసి రాగా.. ఎదురుగా ఒక పెద్ద పాము ప‌డ‌గ విప్పి క‌నిపించింద‌ని.. దాన్ని చూడ‌గానే భ‌య‌ప‌డిపోయిన తాను.. తాను వ‌చ్చిన దారిలోనే వెన‌క్కి నాలుగు కిలోమీట‌ర్లు పరుగెత్తుకుని వెళ్లిపోయాన‌ని.. మ‌ళ్లీ జీవితంలో కేబీఆర్ పార్కు ముఖం చూడ‌లేద‌ని చెప్పాడు. ఇక షూటింగ్ టైంలో త‌న‌కు ఎదురైన మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర అనుభ‌వం గురించి మ‌హేష్ ఇందులో గుర్తు చేసుకున్నాడు. భ‌ర‌త్ అనే నేను షూటింగ్‌లో భాగంగా ఒక ఇంటెన్స్ సీన్లో తాను సీరియ‌స్‌గా డైలాగ్ చెబుతుంటే ఎదురుగా ఉన్న ఒకావిడ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ క‌నిపించింద‌ని, అది చూసి కోపం వ‌చ్చి ఫోన్ ఆపేయ‌మ‌న్నాన‌ని.. అదే బాల‌య్య అయితే మైక్ తీసి ఆమె మీద వేసేవార‌ని మ‌హేష్ చ‌మ‌త్క‌రించ‌డం విశేషం.

ఇక వెయ్యిమందికి పైగా పిల్ల‌ల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు చేయించ‌డానికి పురిగొల్పిన‌ కార‌ణాన్ని కూడా ఈ షోలో మ‌హేష్ వెల్ల‌డించాడు. త‌న కొడుకు గౌత‌మ్ ఆరు వారాల ముందే పుట్టాడ‌ని.. అప్పుడ‌త‌ను త‌న అర‌చేయంతే ఉన్నాడ‌ని, ఇప్పుడు ఆర‌డుగుల‌య్యాడ‌ని.. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుంది కాబట్టి అవ‌స‌ర‌మైన వైద్యం చేయించుకోగ‌లిగానని.. డ‌బ్బు లేని వాళ్ల ప‌రిస్థితేంట‌ని ఆలోచించి ఈ సేవ‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు మ‌హేష్ తెలిపాడు.