హీరోలుగా ఎంట్రీ ఇచ్చి విలన్లుగా సెటిలవుతుంటారు కొందరు. కానీ హీరోయిన్స్ విషయంలో ఇలా జరగడం తక్కువే. కెరీర్‌లో ఎప్పుడైనా ఓ నెగిటివ్ రోల్ చేసి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు హీరోయిన్లు. లేదా వయసు మీదపడి, అవకాశాలు తగ్గాక విలన్లుగా కనిపిస్తుంటారు.. లక్ష్మి, మంజుల, జయచిత్ర లాంటివారిలా. కానీ వరలక్ష్మీ శరత్‌కుమార్ అలా కాదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే రూటు మార్చేసింది. హీరోయిన్‌గా తాను సక్సెస్ కాలేనని అనుమానం రాగానే విలన్‌గా టర్న్ అయ్యింది.
పోడా పోడీ, మదగజరాజ, మానిక్య వంటి చిత్రాలతో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని ఆశపడింది వరలక్ష్మి. కానీ ఆమెకి అదృష్టం కలసి రాలేదు. దాంతో నిడివితో పని లేకుండా తానేంటో ప్రేక్షకులకి చూపించగల పాత్ర ఏదైనా సరే పోషించడానికి సిద్ధపడింది. ఆ క్రమంలో ఆమెకి నెగిటివ్ రోల్స్ కలిసొచ్చాయి. సర్కార్, పందెంకోడి 2 లాంటి చిత్రాలతో పర్‌ఫెక్ట్ లేడీ విలన్‌గా స్టాంప్ వేయించేసుకుంది.
అదే ఆమెను టాలీవుడ్‌కి రప్పించింది. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్, క్రాక్ చిత్రాల్లో లేడీ విలన్‌గా అదరగొట్టేసింది వరలక్ష్మి. దాంతో ఇక్కడ అవకాశాలు క్యూ కడుతున్నాయి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తీయనున్న చిత్రంలో వరలక్ష్మి విలన్‌గా నటిస్తోంది. సమంత లీడ్ రోల్ చేస్తున్న ‘యశోద’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పుడు ‘మైఖేల్’లో కూడా ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తోందని టీమ్ నిర్థారించింది.
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రంజిత్ జయకోడి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తోంది. గౌతమ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నాడు. అతనితో సమానమైన క్యారెక్టర్‌ను వరలక్ష్మి పోషిస్తోందట. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రూపొందుతోంది. అంటే ఇక వరలక్ష్మి నటన ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించబోతోందన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates