ప్రతి వ్యక్తీ వ్యక్తిగత జీవితంలో ఉన్న స్నేహితులతో పాటు తాను పని చేసే రంగంలో సన్నిహితులను సంపాదించుకోవడం సహజం. టైం టు టైం జాబ్స్ చేస్తున్నపుడు కూడా ప్రొఫెషనల్‌గా ఫ్రెండ్స్ తయారవుతారు. ఇక రోజు వారీ పనిలో ఒక టైమింగ్ అంటూ లేకుండా.. మొత్తంగా నిర్దిష్ట కాలం అని లేకుండా పని చేసే ఇండస్ట్రీల్లో స్నేహితులు లేకుండా ఉండరు. అందులోనూ సినిమాలను జీవితంగా మార్చుకుని పని చేసే వ్యక్తులకు ఆ ఇండస్ట్రీలో స్నేహితులు లేరంటే నమ్మడం కష్టంగా ఉంటుంది.
ఇక్కడ అన్ని వ్యవహారాలూ సక్సెస్ చుట్టూ, డబ్బుల చుట్టూనే తిరుగుతాయన్న మాటలు వినిపిస్తున్నా సరే.. ఇందులోనూ ఆప్త మిత్రులు ఉంటారు. కానీ మూడు దశాబ్దాలకు పైగా తాను పని చేస్తున్న పరిశ్రమలో తనకు ఒక్కరంటే ఒక్క స్నేహితుడు కూడా లేదని తేల్చేశాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగానే మాట్లాడారు ఓ ఇంటర్వ్యూలో. తమిళ నటుడు అర్జున్ తనకున్న జెన్యూన్ ఫ్రెండ్స్‌లో ఒకడని జగపతిబాబు చెప్పాడు.
తమది ఎన్నో ఏళ్ల అనుబంధం అని.. ఆ స్నేహంతోనే ఒకరి సినిమాల్లో ఒకరం నటించామని, వ్యక్తిగతంగా కూడా తమ మధ్య మంచి అనుబంధం ఉందని జగపతి చెప్పాడు. ఐతే అర్జున్, తాను గొడవపడే తీరు చూస్తే మాత్రం చూసే వాళ్లకు తాము స్నేహితుల్లా కాకుండా శత్రువుల్లా కనిపిస్తామని ఆయన అన్నాడు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మీకు స్నేహితులెవరూ లేరా అని అడిగితే.. నిజాయితీగా చెప్పాలంటే లేరు అనేశారు జగపతి.
ఎవరినైనా స్నేహితుడు అని చెబుదామనుకుంటే వాళ్లు ఎలాంటి వాళ్లు, తనతో వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గుర్తుకొస్తుందని.. అలా గుర్తొచ్చినపుడు వారిని తాను స్నేహితులు అనలేనని జగపతి తేల్చేశాడు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనుకునేవాళ్లందరూ రాత్ గయా.. బాత్ గయా టైపే అని ఆయన వ్యాఖ్యానించాడు. జగపతిబాబు ముక్కుసూటి మనిషి అనే విషయం అందరికీ తెలుసని.. మరీ తాను మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న పరిశ్రమలో ఒక్కరంటే ఒక్క స్నేహితుడు కూడా లేడని చెప్పేంత ముక్కుసూటి తనం ఆయనది కావడమే ఆశ్చర్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates