జగపతిని మొహం చూపించొద్దన్న తారక్

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు.. హీరో క్యారెక్టర్లను డామినేట్ చేసే సందర్భాలు చాలా తక్కువే. విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్లు అంత బాగా ఎలివేట్ అవుతాయన్న సూత్రం వాస్తవమే అయినా.. దాన్ని పాటించే దర్శకులు తక్కువ. ఎంతసేపూ హీరో పాత్రల్ని ఎలివేట్ చేయడానికే చూస్తారు. విలన్లను జోకర్లను చేసి హీరోలు ఆడుకునే సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి.

తన కెరీర్లో కూడా అలాంటి విలన్ పాత్రలు చాలా చేశానని.. కానీ కొన్ని చిత్రాల్లో మాత్రం తాను చేసిన నెగెటివ్ రోల్స్ చాలా బాగా వచ్చాయని చెప్పారు సీనియర్ నటుడు జగపతి బాబు. అలాంటి పాత్రల్లో ‘అరవింద సమేత’లోని బసిరెడ్డి క్యారెక్టర్ ఒకటన్నారాయన. ఈ పాత్ర విషయంలో తారక్‌కు తన మీద చాలా కోపం వచ్చిందని.. షూటింగ్ టైంలో తనపై కసినంతా తీర్చుకున్నాడని.. అంతే కాక నాలుగైదేళ్లు మీ మొహం నాకు చూపించొద్దు అన్నాడని కూడా జగపతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘అరవింద సమేత’లో తాను చేసిన బసిరెడ్డి పాత్ర చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని.. తారక్ పాత్ర ప్యాసివ్‌గా ఉంటుందని.. సినిమా అంతా తనదే డామినేషన్ అని.. ఇలాంటి పాత్రను తారక్ స్థాయిలో ఉన్న స్టార్ హీరో ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు జగపతి. షూటింగ్ టైంలో కూడా తన పాత్ర డామినేషన్ చూసి రోజూ రాత్రి ఫోన్ చేసి తారక్ తనను సరదాగానే తిట్టేవాడని జగపతిబాబు చెప్పారు.

నువ్వు తారక్‌నే డామినేట్ చేస్తున్నావ్ అంటూ.. ఇంకో  నాలుగైదేళ్లు మొహం నాకు మొహం చూపించొద్దు, నేను మీతో నటించను అని తారక్ అన్నట్లు జగపతి వెల్లడించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా తన పాత్ర డామినేషన్ గురించి తారక్ ప్రస్తావించాడని.. సినిమా చూశాక ప్రేక్షకులకు తన క్యారెక్టర్ కంటే బసిరెడ్డి పాత్రే గుర్తుంటుందని.. అలా మాట్లాడటం తారక్ గొప్పదనం అని అన్నారు జగపతి.