ఏం జరిగినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించే వైసీపీ నేతల మైండ్ గేమ్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన సినిమా పరిశ్రమకు ఏపీలో ఎదురవుతున్నసమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ వద్దకు వచ్చారు. సీఎం ఆహ్వానిస్తేనే వచ్చినట్టు ఆయన ఆది నుంచి చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆయన సినిమా పెద్దగా తాను వ్యవహరించనని చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా తాడేపల్లి బాట పట్టడం.. ముఖ్యమంత్రి జగన్‌తో భోజన విరామ చర్చలకు సిద్ధపడడం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. సినీ పరిశ్రమలోనూ చర్చకు దారితీశాయి. సరే.. ఇప్పటికైనా.. సినీ పరిశ్రమ సమస్యలు తొలగిపోతాయని అనుకున్నారు.
అయితే.. ఈ విషయంలో.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించి.. చిరు పర్యటనపై.. అధికార పార్టీ నేతలు కొన్ని లీకులు ఇచ్చారు. దీంతో చిరుపై తీవ్రస్థాయిలో చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఏపీలో ఇబ్బందుల్లో ఉంది. ప్రబుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. చేస్తున్న ఒత్తిళ్లు వంటి వాటి నేపథ్యంలో పరిశ్రమ తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. టికెట్ల ధర తగ్గింపు, ధియేటర్లపై అధికారుల దాడులతో ఏపీలో పరిస్థితిపై సినీ వర్గాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా అంశాలపై చర్చించేందుకు జగన్.. చిరును ఆహ్వానించారు. అయితే.. ఈ చర్చల సారాంశం ఎలా ఉన్నా.. దీనిపై మరో కోణంలో వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు.
చిరంజీవికి.. వైసీపీ అధినేత, సీఎం జగన్.. రాజ్యసభ సీటును ఆఫర్ చేశారని.. అందుకే చిరు.. చర్చలకు వచ్చారని కొన్ని వర్గాల మీడియాకు నేతలు లీకులు ఇచ్చారు. దీంతో వారు ఫస్ట్ పేజీలలో ఇదే వార్తను ప్రచురించారు. ఇది ఇటు సీని పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ.. దావాలనంగా వ్యాపించి,… అందరినీ విస్మయానికి గురి చేసింది. `ఏదో అనుకున్నా.. ఇదా జరిగింది?` అని సీని ప్రముఖులు కూడా బుగ్గలు నొక్కుకున్నారు. ఎందుకంటే.. చిరు సీఎం వద్దకు వెళ్లారని తెలియడంతో సినీ రంగ సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ భావించారు. కానీ, ఇంతలోనే ఇలా లీకులు రావడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో చిరు ఇమేజ్ పూర్తిగా డ్యామేజీ అయ్యే పరిస్థితి వచ్చింది.
ఇక, దీనిపై తాజాగా చిరు వివరణ ఇచ్చారు. రాజ్యసభ ఆఫర్ వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను రాజకీయాలకు పూర్తి దూరమని స్పష్టం చేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఇస్తానన్నది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తాను అతీతమని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు. ఇలాంటి ఆఫర్లను తాను కోరనని ప్రకటించారు. అటువంటి వాటికి తాను దూరమని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌కు చిరు చెక్ పెట్టారని అంటున్నారు ఆయన అభిమానులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates