దిల్ రాజు వాడకం మామూలుగా లేదు

అశిష్ రెడ్డి.. టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న మరో వారసుడు. అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి వస్తున్న తొలి నటుడు ఇతను. రాజు సోదరుడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ వ్యవస్థాపకుడు అయిన శిరీష్ తనయుడే ఈ అశిష్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన రాజు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఒక హీరో అడుగు పెడుతుంటే హంగామా మామూలుగా ఉంటుందా? రెండు వారాల కిందట ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైన దగ్గర్నుంచి హడావుడి అలా ఇలా లేదు.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి అగ్ర కథానాయకులు వచ్చి ఈ సినిమాను తమ చిత్రంలా భావించి ప్రమోట్ చేశారు. ప్రమోషన్ల పరంగా ఇలా స్టార్ హీరోల సహకారం తీసుకున్న రాజు.. కంటెంట్ విషయంలో తన క్యాంపులోని దర్శకుల నుంచి సాంకేతిక సహకారం కూడా బాగానే అందుకున్నట్లు సమాచారం.రాజు బేనర్లో వరుసగా సినిమాలు చేస్తున్న వేణు శ్రీరామ్, అనిల్ రావిపూడి.. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.

వీళ్లు చెప్పిన మార్పులు చేర్పులను అనుసరించి ఫైనల్ కాపీ తీశారట. రౌడీ బాయ్స్ దర్శకుడు హర్షది ఒక్క సినిమా అనుభవమే. అతను ఇంతకుముందు హుషారు అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. అతణ్ని నమ్మి అవకాశం ఇచ్చినప్పటికీ.. అశిష్ తొలి చిత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలన్న ఉద్దేశంతో అనిల్, వేణుల అనుభవాన్ని ఉపయోగించుకున్నాడట రాజు.

ఈ చిత్రానికి వేరే ప్యాడింగ్ కూడా గ్రాండ్‌గానే కుదిరింది. అనుపమ పరమేశ్వరన్ లాంటి పేరున్న కథానాయికను అశిష్‌కు జోడీగా పెట్టడమే కాదు.. సినిమాటోగ్రాఫర్ మాది, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్లను సెట్ చేశాడు రాజు. బడ్జెట్ కూడా బాగానే పెట్టారని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి తన కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరో కోసం రాజు ప్యాడింగ్, వాడకం ఒక రేంజ్‌లోనే ఉన్నాయి. మరి ఇవన్నీ తోడై రౌడీ బాయ్స్ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.