అంతా అనుకున్న ప్రకారం జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు ఈ సంక్రాంతికే సందడి చేయాల్సింది. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమైంది. ఇప్పటికీ చిత్రీకరణ సగమే పూర్తయింది. ఇంకో ఆరు నెలలకు కానీ సినిమా పూర్తయ్యేలా లేదు. బహుశా ఈ ఏడాది దసరా సమయానికి ఆ సినిమా విడుదలకు సిద్ధం కావచ్చేమో.
పవన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ మూవీ గురించి చాన్నాళ్లుగా ఏ అప్ డేట్ లేదు. పవన్ ఎప్పుడూ తన సినిమాల గురించి మాట్లాడడు. క్రిష్ మధ్యలో కొండపొలం మీదే తన ఫోకస్ అంతా పెట్టాడు. ఇక సినిమా బృందంలో ఇంకెవ్వరూ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడింది లేదు.
ఐతే తాజాగా ఇందులో ఓ కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ తన కొత్త చిత్రం హీరో ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన నేపథ్యంలో అక్కడక్కడా హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతోంది. ఈ సినిమా టీజర్ చూస్తే ఇది పూర్తి స్థాయి పీరియడ్ లాగా కనిపించింది. కానీ ఈ సినిమాలో మరో కోణం ఉందని నిధి వెల్లడించింది. హరిహర వీరమల్లు కథ రెండు వేర్వేరు కాలాల్లో నడుస్తుందని ఆమె వెల్లడించింది.
ప్రధానంగా దశాబ్దాల కిందటి నేపథ్యంలో కథ నడుస్తుందని.. అదే సినిమాకు హైలైట్ అని.. అలాగే వర్తమానంలోనూ కొంత కథ నడుస్తుందని ఆమె వెల్లడించింది. అంటే మగధీర తరహాలో ఊహించుకోవచ్చన్నమాట. పాత కాలం నాటి పవన్ లుక్ ఆల్రెడీ జనాలకు పరిచయం అయింది. దీంతోపాటు పవన్ మోడర్న్ లుక్‌లోనూ దర్శనమివ్వనున్నాడనన్నమాట. పవన్ ఇలా ఇంతకు ముందెన్నడూ కనిపించని నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తి రేకెత్తించేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates