హద్దులు దాటుతున్న ఆహా

ప్రపంచంలో ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఏదో ఒక్క భాషలో కంటెంట్‌ ఇచ్చే విధానంతో ఈ రంగంలోకి అడుగు పెట్టలేదు. కానీ ‘ఆహా’ మాత్రం ఆ కాన్సెప్ట్‌తోనే బరిలోకి దిగింది. తెలుగువారి ఓటీటీగా పరిచయం చేసుకుంటూ కేవలం తెలుగు కంటెంట్‌తోనే ప్రస్థానం మొదులపెట్టింది ఆహా. తెలుగు సినిమాలకు తోడు వేరే భాషల సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి అందజేయడం ద్వారా ఎక్స్‌క్లూజిక్ తెలుగు ఓటీటీ అనే పేరును నిలబెట్టుకుంటూ వచ్చింది.

ఆ తర్వాత తెలుగులో పెద్ద సంఖ్యలోనే వెబ్ సిరీస్‌లు కూడా రూపొందించింది. దీనికి తోడు రియాలిటీ షోలు, టాక్ షోలు కూడా యాడ్ అయ్యాయి. వీటితో ఆహాకు ఆదరణ బాగానే పెరిగింది. తమ ఓటీటీకి 15 లక్షల సబ్‌స్క్రైబర్లు తయారైనట్లుగా ఇటీవలే ఆహా అధినేత అల్లు అరవింద్ వెల్లడించడం తెలిసిందే.

ఐతే తెలుగులో పెద్ద టార్గెట్‌నే అందుకున్న ఆహా.. ఇప్పుడు ఇతర భాషలకు విస్తరించే పనిలో పడింది.ఇందులో భాగంగా ముందుగా తమిళంలోకి అడుగు పెడుతోంది ఆహా. తమిళ ఓటీటీ లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. ముందుగా తమిళంలో కొన్ని పేరున్న సినిమాల హక్కులు తీసుకుని, అలాగే కొన్ని ఒరిజినల్స్ కూడా రూపొందించుకుని ఆ తర్వాత ఆ భాషలోకి అడుగు పెట్టబోతోంది ఆహా.

ఆ తర్వాత హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోకి కూడా అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఆహా మొదలైనపుడు ప్రాంతీయ భాషలో ఓటీటీ ఏంటి.. అమేజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి స్టార్ ప్లేయర్ల పోటీని తట్టుకుని ఇదెంత మేర నిలబడుతుందో అన్న సందేహాలు మొదలయ్యాయి కానీ.. అల్లు అరవింద్ మాస్టర్ బ్రైన్ బాగా పని చేసి.. వ్యూహాత్మకంగా ఆహా అడుగులు ముందుకు పడ్డాయి. ఇప్పుడు పెద్ద ఓటీటీలకు దీటుగా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే ఎక్కువ కంటెంట్ ఇస్తూ ఆదరణ పెంచుకుంది. మరి ఇతర భాషల్లోనూ ఆహా ఇలాగే దూకుడు చూపిస్తుందేమో చూడాలి.